కాసేపట్లో తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ... ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం

Update: 2019-09-08 07:45 GMT

కాసేపట్లో తెలంగాణ రాష్ట్రమంత్రి వర్గం విస్తరించనున్నారు. ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం కల్పించనున్నారని తెలిసింది. ఆదివారం దశమి కావడంతో సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ , పువ్వాడ అజయ్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సమీకరణాలు మారితే ఇందులో కొన్ని పేర్లు మారే అవకాశం ఉంది. మంత్రి వర్గంలో ఒకరు లేదా ఇద్దరిని తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

మంత్రివర్గంలో 18మందికి అవకాశం ఉండగా... ప్రస్తుతం 12మందే ఉన్నారు. మరో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. వీటి కోసం గట్టి పోటీ ఉంది. మంత్రి వర్గంలో మహిళ, గిరిజన కోటా ఖాళీగా ఉంది. కేటీఆర్‌కు పార్టీ కార్యనిర్వాహక బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్‌పై ఒత్తిడి వస్తోంది. మరోవైపు హరీష్ రావుకు సైతం మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఒక బలమైన సామాజిక వర్గం నుంచి కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేరు వినిపిస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. మహిళా కోటాలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. 

Tags:    

Similar News