ఈ నంబరుకు కాల్ చేస్తే మీ ఇంటి ముందుకు కూరగాయలు..

కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే.

Update: 2020-03-31 11:30 GMT
Niranjan Reddy (File Photo)

కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ప్రజలు కూరగాయల కోసం బయటికి రాకుండా ఉండేందుకు మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటు చేసారని, వాటి ద్వారా తక్కువ ధరలకు వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలకు కూరగాయలు తరలిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సరూర్‌నగర్‌ స్టేడియంలోకి ఎల్బీనగర్‌ కూరగాయల మార్కెట్‌ను తాత్కాలికంగా తరలించడానికి ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నాని తెలిపారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ సహకారం అందించాలని, ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రజలు సహకరించాలని సూచించారు.

అందులో భాగంగానే వ్యవసాయ మార్కెట్లను ఖాళీ ప్రదేశాలకు తరలిస్తున్నారన్నారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రజలు గుమిగూడే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కూరగాయల కొనుగోలుకు వచ్చిన ప్రజలు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇక పోతే అపార్టుమెంట్లలో ఉండే వారి కోసం మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటుచేసామని, దానికి మంచి స్పందన లభిస్తుందన్నారు. అపార్టుమెంట్ వాసులు, కూరగాయలు కావాల్సిన వారు 7330733212 ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేసి నమోదు చేసుకోవాలన్నారు. అలా చేసుకుంటే కూరగాయల వాహనం వారి ప్రాంతానికి ఎప్పుడు, ఏ సమయంలో వస్తుందో సమయం చెబుతారని మంత్రి తెలిపారు. అంతే కాక ఈ నంబరుకు మొబైల్‌ రైతు బజారు నడిపించాలనుకున్న వారు కాల్ చేసి సంప్రదించొచ్చని సూచించారు.


Tags:    

Similar News