నేటి నుంచి వైన్‌షాపులు రాత్రి 8:30 వరకు

లాక్ డౌన్ కారణంగా గత నెల వరకూ మూతపడిన వైన్ షాపులు సడలింపుల్లో భాగంగా తెరచుకున్న విషయం తెలిసిందే.

Update: 2020-06-06 04:40 GMT
srinivas goud(File photo)

లాక్ డౌన్ కారణంగా గత నెల వరకూ మూతపడిన వైన్ షాపులు సడలింపుల్లో భాగంగా తెరచుకున్న విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు శనివారం నుంచి రాత్రి 8:30 గంటల వరకూ తెరిచి ఉంటాయని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్‌శాఖపై శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గీత కార్మికుల గురించి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి గీత కార్మికునికీ శాఖాపరమైన సభ్యత్వ కార్డులను అందజేయాలని తెలిపారు. అంతే కాకుండా సొసైటీలకు ఇచ్చే ఈత చెట్లు, తాటి చెట్ల కాలపరిమితిని కూడా పదేళ్ల పాటు పెంచుతూ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ ఏడాది హరితహారంలో భాగంగా 45 లక్షల తాటి, ఈత మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. చెట్టు నుంచి దించిన నీరా అమ్మకాలను టెట్రా ప్యాక్‌లలో మాత్రమే జరపాలని, ప్లాస్టిక్‌ సీసాలలో అసలు వాడకూడదని మంత్రి కోరారు.

గ్రామాల్లో గుడుంబా తయారీని నిషేధించామని ఎవరైనా గుడుంబా తయారు చేసినట్లు సమాచారం అందితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆబ్కారీ శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులలు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలను పటిష్టపరిచేందుకు ఒక సమర్థవంతమైన అధికారిని నియమిస్తామన్నారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా ఉండేలా చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, అదనపు కమిషనర్‌ అజయ్‌రావు, డిప్యూటీ కమిషనర్‌లు ఖురేషీ, కేఏబీ శాస్త్రి, సహాయ కమిషనర్‌ హరికిషన్, ఈఎస్‌లు దత్తరాజుగౌడ్, చంద్రయ్య, ప్రదీప్‌ రావు, గణేశ్‌ గౌడ్, రఘురాం, జనార్దన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News