అటవీ సిబ్బందిపై మరో దాడి

Update: 2019-07-02 06:12 GMT

ఫారెస్ట్ అధికారులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం సిర్పూర్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ అధికారిణిపై దాడి జరగ్గా.. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న వారు అటవీ అధికారులపై దాడి చేశారు. గుండాలపాడు పంచాయితీ పరిధిలో పోడు భూములను ట్రాక్టర్లతో దున్నుతున్నారన్న సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసి బేస్ క్యాంప్‌నకు తరలిస్తుండగా.. స్థానికులు కర్రలతో దాడి చేశారు. గాయపడిన అటవీ అధికారులు ములకలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారులపై పోడు సాగుదారులు దాడికి పాల్పడ్డారు. కుమ్రంభీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై ఎమ్మెల్యే తమ్ముడి దాడిని మరువక ముందే మళ్లీ అదే తరహా దాడి జరిగింది. ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో కొంతమంది పోడుదారులు ట్రాక్టర్లతో అటవీశాఖకు చెందిన భూమిని దున్నుతున్నారన్న సమాచారంతో అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సెక్షన్‌ ఆఫీసర్‌ నీలమయ్య, బీట్‌ ఆఫీసర్‌ భాస్కరరావు ట్రాక్టర్లను ఆపి ప్రశ్నించే సమయంలో ఒక్కసారిగా అధికారులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరి అధికారుల వీపుపై గాయాలయ్యాయి. అక్కడనుంచి తప్పించుకున్న అటవీ అధికారులు ముల్కలపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుమన్‌ తెలిపారు.

Tags:    

Similar News