దొరకని చిరుత జాడ..శివార్ల ప్రజల్లో గుండె దడ!

హైదరాబాద్ శివార్లలో రోడ్డుపై ప్రత్యక్షం అయి మాయం అయిపోయిన చిరుత కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Update: 2020-05-16 04:05 GMT
Leopard in Hyderabad road (file photo)

జాతీయరహదారిపై ప్రత్యక్షం అయిన చిరుత అక్కడి నుంచి మాయం అయిపొయింది. ఈ సంఘటన గురువారం జరిగిన సంగతి తెలిసిందే.  అప్పటి నుంచి చిరుత జాడను గుర్తించడానికి, పట్టుకోవదానికీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకూ ఫలించలేదు.

కాటేదాన్ వద్ద గురువారం జాతీయ రహదారిపై అకస్మాత్తుగా చిరుత కనిపించింది. అది కొద్ది సేపు రోడ్డుపై పడుకుంది. తరువాత రోడ్డుపై అటూ ఇటూ పరుగులు తీస్తూ వాహనదారులను బెంబేలు పెట్టించింది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ సుబానీపై దాడి చేసి గాయపరిచింది. ఈ సంఘటనలు అన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రోడ్డుపై ఉన్న డ్రైవర్లు చిరుతను చూడి భయంతో పరుగులు తీశారు. ఒక డ్రైవర్ తొందరగా లారీలోకి ఎక్కేశాడు. మరో డ్రైవర్ సుభానీ లారీ ఎక్కుతుండగా చిరుత అతనిపై దాడి చేసింది. ఈ దాడిలో అతనికి గాయాలయ్యాయి. కానీ, దాని బారి నుంచి తప్పించుకున్నాడు. అటు తరువాత చిరుత పరుగులు తీస్తూ అక్కడి నుంచి పారిపోయింది.

అప్పుడు పారిపోయిన చిరుతను పట్టుకోవడం కోసం అధికారులు మూడు రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత సంచరిస్తుందన్న అనుమానం ఉన్న ప్రాంతాల్లో దానికోసం ఆహారాన్ని ఉంచారు. మరోవైపు జాగిలాల ద్వారా చిరుత జాడ కోసం ప్రయత్నాలూ ప్రారంభించారు. కానీ, దానిని ఇప్పటివరకూ గుర్తించలేకపోయారు.

ఇప్పటికే దాని పాదముద్రల ప్రకారం ఆ చిరుత మైలార్‌దేవుపల్లి మీదుగా రాజేంద్రనగర్ వర్సిటీ పరిసరాల్లోని అటవీ ప్రాంతానికి, అక్కడి నుంచి చిలుకూరు అటవీప్రాంతంలోకి వెళ్లి ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అది వెళ్లినట్టుగా భావిస్తున్న ప్రాంతాల్లో దానికి ఆహారంగా మారిన జంతువుల కళేబరాలను అధికారులు గుర్తించారు. దీంతో అది ఆహారం కోసం మళ్లీ అదే ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని భావించి బోనులు ఏర్పాటు చేశారు. దీంతో శివారు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. 

మరోవైపు రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత జాడలు కనిపిస్తే సమాచారం అందించాలని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి చెప్పారు. 




 



Tags:    

Similar News