Municipal Elections 2020: దశాబ్దాలు గడుస్తున్నా తీరని సమస్యలు

ఎన్ని ఎన్నికలు వచ్చినా, ఎంతమంది నాయకులు గెలిచినా, దశాబ్దాలు గడుస్తున్నా ఆదిలాబాద్, నిర్మల్, మాంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రజల సమస్యలు ఇప్పటివరకూ పరిష్కరించబడలేదు.

Update: 2020-01-18 06:05 GMT

ఎన్ని ఎన్నికలు వచ్చినా, ఎంతమంది నాయకులు గెలిచినా, దశాబ్దాలు గడుస్తున్నా ఆదిలాబాద్, నిర్మల్, మాంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రజల సమస్యలు ఇప్పటివరకూ పరిష్కరించబడలేదు. ఉమ్మడి జిల్లాల్లో మౌలిక సదుపాయాల కొరత, అపరిశుభ్రత, పారుదల సమస్యలతో కష్టపడుతున్నామని ఆ ప్రాంత ప్రజలు చెపుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను గెలిచిన తరువాత నెరవేర్చడం మర్చిపోతున్నారన్నారు.

ఇక పోతే ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ లో12 మునిసిపాలిటీలు ఉంటే వాటిలో 11 మునిసిపాలిటీలకు మాత్రమే నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మందమర్రి మునిసిపాలిటీ కోర్టు కేసులో ఉన్నందున ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించడంలేదని అధికారులు స్పష్టం చేసారు.

నూతన జిల్లాలు ఏర్పడక ముందు ఏడు మునిసిపాలిటీలు మాత్రమే ఉండేవి. జిల్లాల ఏర్పాటు తరువాత కొత్త గ్రామాలను మునిసిపాలిటీలలో విలీనం చేయండంతో ఈ సంఖ్య 12 కు చేరింది. కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలలో ఖానాపూర్, లక్సెట్టిపేట్, నాస్పూర్, చెన్నూర్, క్యాతన్ పల్లిలు ఉన్నాయి.

ఇక ఆదిలాబాద్ జిల్లాలో మునిసిపాలిటీని 1952 సంవత్సరంలో ఏర్పాటు చేసారు. కొద్ది రోజుల తరువాత దాన్ని గ్రేడ్ త్రీ నుంచి గ్రేడ్ వన్ కు అప్‌గ్రేడ్ చేశారు. ఇదిలా ఉంటే 1,52,968 జనాభా ఉన్న మునిసిపాలిటీలో మూడు కిలోమీటర్ల దూరం వరకు ఉన్న కొన్ని గ్రామాలను అందులో విలీనం చేయడంతో వార్డుల సంఖ్య 49 కి పెరిగింది.

ఇక పోతే ఈ వార్డులలోని ప్రజలను ముఖ్యంగా వెంటాడుతున్న సమస్య సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం. దీని వలన వార్డుల్లో అపరిశుభ్రత పెరిగి దోమలు అధికంగా పెరిగిపోవడంతో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వైరల్ జ్వరాల బారిన బాధపడుతున్నారు. అంతే కాక ప్రధాన రహదారులకు ఫుట్‌పాత్‌లు లేక పాదాచారులు రోడ్లపైనే నడవడంతో ట్రాఫిక్ అంతరాయం కులుగుతుంది.

ఇక నిర్మల్ మునిసిపాలిటీ విషయానికొస్తే 1953 లో అక్కడ మున్సిపాలిటీ ఏర్పడింది. 44 వార్డులకు గాను మొత్తం 1.40 లక్షల జనాభా ఉన్నారు. ఈ వార్డులలో కూడా తాగునీటి సమస్య, రోడ్ల సమస్య ఎప్పటికప్పుడు ఉంటూనే ఉన్నాయి. ప్రతి నాయకుడు గెలవడానికి సమస్యలు పరిష్కరిస్తామిన హామీ ఇస్తున్నారే తప్ప సమస్యలు తీర్చడంలో నాయకులు విఫలమయ్యారని ప్రజలు విమర్శించారు.

మంచిర్యాల మునిసిపాలిటీలోనూ ప్రజలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నది అతి సమీపంలోనే ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన రోడ్లు లేకుండా ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

ఇక పోతే అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యలతో పోల్చుకుంటే ఎక్కువ సమస్యలతో భైన్సా మునిసిపాలిటీ అడ్డాగా మారింది. ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ లేకపోవడంతో మునిసిపల్ సిబ్బంది రోడ్డు పక్కనే చెత్తను పారేస్తున్నారు. దీంతో కాలనీలన్నీ చెత్తతో పేరుకుపోతున్నాయని ప్రజలు చెపుతున్నారు. బెల్లంపల్లి మునిసిపాలిటీలోనూ అదే పరిస్థితి నెలకొంది.     

Tags:    

Similar News