Neuralink Blindsight: పుట్టుకతోనే చూపులేని వారికి చూపు ఇచ్చే మస్క్ ఆవిష్కరణ

ఎలాన్ మస్క్ న్యూరాలింక్ రూపొందించిన బ్లైండ్‌సైట్ బ్రెయిన్ ఇంప్లాంట్‌కు FDA బ్రేక్‌థ్రూ గుర్తింపు లభించింది. 2026లో మనుషులపై పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Update: 2026-01-03 05:52 GMT

Neuralink Blindsight: పుట్టుకతోనే చూపులేని వారికి చూపు ఇచ్చే మస్క్ ఆవిష్కరణ

పుట్టుకతోనే చూపులేని వారికి చూపు అందించే దిశగా ఎలాన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ సంస్థ కీలక ముందడుగు వేసింది. ‘బ్లైండ్‌సైట్’ అనే బ్రెయిన్ ఇంప్లాంట్ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించినట్లు న్యూరాలింక్ వెల్లడించింది. 2026లో తొలిసారిగా మనుషులపై ఈ ఇంప్లాంట్‌ను పరీక్షించేందుకు సంస్థ సిద్ధమవుతోంది.

బ్లైండ్‌సైట్ ఇంప్లాంట్‌కు ఇప్పటికే 2024 సెప్టెంబర్‌లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నుంచి ‘బ్రేక్‌థ్రూ డివైస్’ హోదా లభించింది. ఇది ప్రాణాంతక వ్యాధులు లేదా తీవ్రమైన వైద్య సమస్యలకు పరిష్కారంగా మారే అవకాశమున్న పరికరాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఇచ్చే ప్రత్యేక గుర్తింపు కావడం గమనార్హం.

గతేడాది మార్చిలో ఎలాన్ మస్క్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా బ్లైండ్‌సైట్ ఇంప్లాంట్ ఇప్పటికే కోతుల్లో విజయవంతంగా పనిచేస్తోందని వెల్లడించారు. ప్రారంభ దశలో చూపు రిజల్యూషన్ తక్కువగా ఉండొచ్చని, అయితే భవిష్యత్తులో ఇది సాధారణ మనిషి చూపును కూడా మించవచ్చని ఆయన తెలిపారు.

జనవరి 1న మరోసారి స్పందించిన మస్క్, న్యూరాలింక్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ పరికరాలను భారీ స్థాయిలో తయారు చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో పూర్తిగా ఆటోమేటెడ్ శస్త్రచికిత్స విధానాన్ని కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ పరికరంలోని సన్నని తంతువులు మెదడును కప్పే డ్యూరా పొరను తొలగించకుండానే లోపలికి ప్రవేశించగలగడం ప్రధాన ప్రత్యేకతగా పేర్కొన్నారు.

కళ్లూ, ఆప్టిక్ నర్వ్ పూర్తిగా దెబ్బతిన్న వారు కూడా మెదడులోని విజువల్ కార్టెక్స్ సక్రమంగా పనిచేస్తే బ్లైండ్‌సైట్ సహాయంతో కనీస స్థాయి చూపును పొందగలరని మస్క్ వివరించారు. ప్రారంభంలో చూపు పాత అటారి వీడియో గేమ్‌ల మాదిరిగా తక్కువ నాణ్యతతో ఉంటుందని, క్రమంగా అది మెరుగుపడుతుందని తెలిపారు.

అయితే, ఈ తరహా బ్రెయిన్ ఇంప్లాంట్ల భద్రత, ప్రభావంపై శాస్త్రవేత్తల మధ్య ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. బ్లైండ్‌సైట్ నిజంగా ఎంతవరకు సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తుందో కాలమే నిర్ణయించాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News