Foxconn: ఐఫోన్ల తయారీకి భారీ నియామకాలు ఫాక్స్‌కాన్‌లో 30 వేల ఉద్యోగాలు.. 80 శాతం మహిళలే
చైనా నుంచి ఉత్పత్తి ఆధారిత వ్యవస్థలను క్రమంగా మార్చే ప్రక్రియను యాపిల్ మరింత వేగవంతం చేసింది. ఈ వ్యూహంలో భాగంగా కర్ణాటకలోని ఫాక్స్‌కాన్ యూనిట్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది.
Foxconn: ఐఫోన్ల తయారీకి భారీ నియామకాలు ఫాక్స్‌కాన్‌లో 30 వేల ఉద్యోగాలు.. 80 శాతం మహిళలే
చైనా నుంచి ఉత్పత్తి ఆధారిత వ్యవస్థలను క్రమంగా మార్చే ప్రక్రియను యాపిల్ మరింత వేగవంతం చేసింది. ఈ వ్యూహంలో భాగంగా కర్ణాటకలోని ఫాక్స్‌కాన్ యూనిట్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. కేవలం 8–9 నెలల వ్యవధిలోనే సుమారు 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ వెల్లడించింది. ఇందులో విశేషమేమిటంటే, ఉద్యోగుల్లో 80 శాతం మంది మహిళలే కావడం.
బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఫాక్స్‌కాన్ దేశంలోనే రెండో అతిపెద్ద ఐఫోన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఫ్యాక్టరీలో ఇటీవలి కాలంలో నియామకాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది ఫ్రెషర్లేనని సమాచారం. ఈ యూనిట్‌లో మొదట ఐఫోన్ 16 మోడల్‌ను ఉత్పత్తి చేయగా, తాజాగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్ల తయారీ కూడా ప్రారంభమైంది. ఇక్కడ తయారవుతున్న ఐఫోన్లలో సుమారు 80 శాతం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
వచ్చే ఏడాది నాటికి ఈ యూనిట్‌లో ఉద్యోగుల సంఖ్యను 50 వేల వరకు పెంచాలని ఫాక్స్‌కాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగుల కోసం ప్లాంట్ ప్రాంగణంలోనే నివాస వసతులు, వైద్య, విద్యా సదుపాయాలు కల్పించడంతో ఈ ప్రాంతం ఇప్పుడు ఒక మినీ టౌన్‌షిప్‌లా కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, ఫాక్స్‌కాన్ తొలి ఐఫోన్ తయారీ కేంద్రం తమిళనాడులో ఉండగా, అక్కడ ఇప్పటికే 41 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అక్కడ కూడా మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు. డిజైన్, టెక్నాలజీ విభాగాల్లో మహిళలను ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఫాక్స్‌కాన్ గతంలోనే స్పష్టం చేసింది.