BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా VoWiFi సేవల ప్రారంభం
BSNL దేశవ్యాప్తంగా VoWiFi సేవలను ప్రారంభించింది. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా వైఫై ద్వారా కాల్స్, మెసేజ్‌లు చేసుకునే అవకాశం.
BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా VoWiFi సేవల ప్రారంభం
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) కొత్త సంవత్సరం సందర్భంగా యూజర్లకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిల్స్‌లో VoWiFi (వాయిస్ ఓవర్ వైఫై) సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారికంగా ప్రకటించింది. ఈ సేవ ద్వారా నెట్‌వర్క్ కవరేజీ సరిగా లేని ప్రాంతాల్లో కూడా వైఫై సహాయంతో కాల్స్, మెసేజ్‌లు చేసుకునే అవకాశం లభించనుంది.
ఈ వైఫై కాలింగ్ ఫీచర్‌ను IMS ఆధారిత ప్లాట్‌ఫామ్‌పై రూపొందించినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్న యూజర్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. సెల్యులర్ సిగ్నల్ పూర్తిగా లేని లేదా బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో కూడా వైఫై ద్వారా నాణ్యమైన వాయిస్ కనెక్టివిటీ సాధ్యమవుతుంది.
ఈ ఫీచర్‌ను ఉపయోగించేందుకు యూజర్లకు ఎటువంటి థర్డ్‌పార్టీ అప్లికేషన్లు అవసరం లేదని బీఎస్‌ఎన్‌ఎల్ స్పష్టం చేసింది. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్ లేదా కనెక్షన్ల విభాగంలో ఉన్న ‘వైఫై కాలింగ్’ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సేవను బీఎస్‌ఎన్‌ఎల్ ఉచితంగా అందిస్తోంది.
బహుళ అంతస్తుల భవనాలు, బేస్‌మెంట్లు, భారీ నిర్మాణాలు ఉన్న ప్రాంతాల్లో సెల్యులర్ నెట్‌వర్క్ సమస్యలు సాధారణమే. అలాంటి ప్రాంతాల్లో ఈ VoWiFi ఫీచర్ ద్వారా నిరంతర కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ భావిస్తోంది. దీంతో పాటు సెల్యులర్ నెట్‌వర్క్‌పై ఉండే రద్దీ కూడా తగ్గుతుందని అంచనా వేస్తోంది.
ఇదిలా ఉండగా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన నవంబర్ 2025 గణాంకాల ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ బేస్ క్రమంగా పెరుగుతోంది. 4G సేవల ప్రారంభం తర్వాత నవంబర్ నెలలో మాత్రమే బీఎస్‌ఎన్‌ఎల్ 4,21,514 మంది కొత్త యూజర్లను సంపాదించుకుంది. ప్రస్తుతం సంస్థ మార్కెట్ షేర్ 7.92 శాతానికి చేరుకుంది.
ప్రైవేట్ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్ భారీగా యూజర్లను ఆకర్షిస్తుండగా, వోడాఫోన్ ఐడియా మాత్రం యూజర్లను కోల్పోయింది. ఈ నేపథ్యంలో VoWiFi వంటి కొత్త సేవలతో బీఎస్‌ఎన్‌ఎల్ తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది.