ఉప్పల్ లో ఉతికేస్తారా.. విండీస్ తో టీమిండియా తొలి T20 కి విండీస్ ప్రాక్టీస్ షూరూ!

భారత, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి T20 మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం సిద్ధం అయింది.

Update: 2019-12-04 02:32 GMT
Hyderabad Uppal cricket stadium(file photo)

వెస్టిండీస్ - టీమిండియాల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ కి  హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సిద్ధం అయింది. ఈ నెల 6 న ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. 

ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఎప్పుడూ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. ఈసారి కూడా అదేవిధంగా బ్యాటింగ్ కు అనుకూలించవచ్చని తెలుస్తోంది. దీంతో పరుగుల వరద ఖాయం అని భావిస్తున్నారు. ఇకపోతే, ఈ మ్యాచ్ కోసం విండీస్ టీమ్ సోమవారమే నాగరాయానికి చేరుకుంది. మంగళవారం  ప్రాక్టీస్  కూడా మొదలు పెట్టేసింది. ఇటు భారత్ జట్టు సభ్యులు ఒకొరొకరుగా మంగళవారం హైదరాబాద్ వచ్చారు. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా ఆటగాళ్లు అందరూ మ్యాచ్ కోసం వచ్చేశారు. వీరు ఈరోజు (బుధవారం) నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నారు. వచ్చే సంవత్సరం టీ20 ప్రపంచ కప్ సమరం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సిరీస్ కీలకం కానుంది. ఇరుజట్లూ ప్రపంచ కప్ సన్నాహకాలకు ఈ సిరీస్ బాగా ఉపకరిస్తుందని భావిస్తున్నాయి. దీంతో ఈ సిరీస్ లో తొలిమ్యాచ్ లో ఆటగాళ్లందరూ తమ సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు.

ఇక ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఇప్పటివరకూ 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. వాటిలో నాలుగు గెలిచింది..ఒకటి డ్రాగా ముగిసింది. ఇక వన్డేల్లో ఇక్కడ టీమిండియా రికార్డ్ సగం సగం గా ఉంది. ఇక్కడ మొత్తం 6 వన్డేలు ఆడిన టీమిండియా మూడింటిలో గెలిచింది. మూడింటిలో ఓటమి పాలైంది. అదేవిదగంగా టీ20 ల విషయానికి వస్తే.. 2017 అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అటు తరువాత ఇప్పటివరకూ ఇక్కడ పొట్టి క్రికెట్ మ్యాచ్ జరగలేదు. 

ఇక ప్రస్తుతం జట్ల ఫామ్ ను బట్టి చూస్తే, టీమిండియా నే ఫేవరేట్ గా చెప్పవచ్చు. ఇటీవల విండీస్ జట్టు అంత చక్కని ఆటతీరు ప్రదర్శించడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో 2 - 1 తేడాతో ఓటమి పాలైంది. మరోవైపు భారత జట్టు బంగ్లాదేశ్ జట్టు పై టెస్ట్ సిరీస్ గెలిచి ఆత్మవిశ్వాసం తో ఉంది.

           


         


Tags:    

Similar News