India vs South Africa 2nd test: త్వరగా రోహిత్ వికెట్ కోల్పోయిన భారత్

Update: 2019-10-10 06:32 GMT

దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ పూణే లో ఈరోజు ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆ నిర్ణయం ప్రకారం బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది.

విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాది సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ.. ఈరోజు పుణెలో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔటైపోయాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఆఫ్ స్టంప్‌ లైన్‌పై విసిరిన షార్ట్ పిచ్‌ బంతిని ఫుల్ చేయాలని తొలుత భావించిన రోహిత్ శర్మ.. ఆ మేరకు చిన్నపాటి పాదాల కదలికలతో షాట్‌కి సిద్ధమైనట్లు కనిపించింది. కానీ.. ఆఖరి క్షణంలో తికమకకి గురైన రోహిత్ శర్మ షాట్ ఆలోచనని విరమించుకుని డిఫెన్స్ చేయగా.. బంతి బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ డికాక్ చేతుల్లో పడింది. దీంతో.. 25 పరుగుల వద్దే భారత్‌ తొలి వికెట్ కోల్పోయింది.

ఆరంభం నుంచి కగిసో రబాడ, ఫిలాండర్.. భారత బ్యాట్స్‌మెన్‌లను పదునైన బౌన్సర్లతో ఇబ్బందులు పెడుతున్నారు. 130-140కిమీ వేగంతో.. చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో వస్తున్న బంతులను అడ్డుకోవడం భారత్ బ్యాట్స్ మెన్ కు కొంచెం కష్టంగా మారింది. దీంతో.. తొలి 10 ఓవర్లు రోహిత్, మయాంక్‌కి బ్యాట్ ఝళిపించే అవకాశం దక్కలేదు.

హనుమ విహారి దూరం..

ఈ మ్యాచ్‌కు హనుమ విహారి దూరమయ్యాడు. అతడి స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా కూడా ఒక్క మార్పుతో బరలోకి దిగుతోంది. తొలి టెస్టులో ఏమాత్రం ఆకట్టుకోలేని ఆఫ్‌స్పిన్నర్‌ పీట్‌ను పక్కకు పెట్టి పేసర్‌ అన్రిచ్ నార్ట్జేను తుది జట్టులోకి తీసుకున్నారు. కాగా, కెప్టెన్‌గా కోహ్లికి ఇది 50వ టెస్టు కావడంతో విశేషం. ఈపోరులో పైచేయి సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లి సేన భావిస్తోంది. అయితే రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని సఫారీ జట్టు ఆరాటపడుతోంది.

Tags:    

Similar News