షూటర్‌ మనుబాకర్‌ను అవమానించిన మంత్రి

ప్రపంచ యువజన ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించినా హర్యానా ప్రభుత్వం తనకు 2 కోట్ల రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇవ్వకపోవడం పట్ల ఏస్ షూటర్ మను బాకర్ ఆందోళన వ్యక్తం చేసింది.

Update: 2019-01-05 11:24 GMT
Manu Bhakar

ప్రపంచ యువజన ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించినా హర్యానా ప్రభుత్వం తనకు 2 కోట్ల రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇవ్వకపోవడం పట్ల ఏస్ షూటర్ మను బాకర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని సాధించినందుకు గాను అభినందనలు తెలుపుతూ హరియాణా ప్రభుత్వం అప్పట్లో రూ.2 కోట్లు నజరానా ప్రకటిస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు. అయితే ఈ విషయంలో ఆలస్యాన్ని గుర్తుచేస్తూ బాకర్‌ మంత్రికి ట్వీట్‌ చేశారు. విజ్‌ రూ.2కోట్ల నజరానా ఇస్తామని గతంలో చేసిన ట్వీట్ల స్క్రీన్‌షాట్స్‌ పోస్టు చేస్తూ 'సర్‌.. దయచేసి చెప్పండి ఇది నిజమేనా? లేక కేవలం జుమ్లా(తప్పుడు హామీ)' అని బాకర్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించాల్సింది పోయి ఆమెను అవమానపరిచే విధంగా మాట్లాడారు.

'మనుబాకర్‌ దీని గురించి ప్రజావేదికగా మాట్లాడే ముందు ఓ సారి క్రీడాశాఖను సంప్రదించాల్సి ఉండేది. ఆమె ఇలా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానపరిచారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం బాకర్‌ రెండు కోట్ల నజరానాను అందుకుంటారు. ఇటువంటి విషయంలో క్రీడాకారులకు కొద్దిగా క్రమశిక్షణ ఉండాలి. ఇలా వివాదాన్ని సృష్టించినందుకు బాకర్‌ తప్పకుండా బాధపడతారు. ఆమె కేవలం తన ఆటమీద మాత్రమే దృష్టి పెట్టాలి' అంటూ మంత్రి విజ్‌ ట్వీట్‌ చేశారు. యూత్ ఒలింపిక్స్ సన్నాహాకాల కోసం తాను భారీమొత్తంలో ఖర్చు చేశానని, ఎవరికైనా జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే యూత్ ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం వస్తుందని మను గుర్తు చేసింది. హర్యానా ప్రభుత్వం అన్ని విధాలా తనను ప్రోత్సహించాలని ప్రోత్సహించగలదన్న విశ్వాసం ఉందని చెప్పింది. ప్రపంచ యువజన ఒలింపిక్స్ తో సహా వివిధ అంతర్జాతీయ టోర్నీలలో తన కుమార్తె దేశానికి బంగారు పతకాలు సంపాదించిపెడుతున్నా హర్యానా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోడం లేదని ప్రకటించిన ప్రోత్సాహక నగదు బహుమతులు సైతం ఇవ్వడం లేదంటూ షూటర్ మను బాకర్ తండ్రి రామకృష్ణ బాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానా ప్రభుత్వ అంబాసిడర్ గా ప్రకటించి ఆ తర్వాత తొలగించడం ద్వారా మనస్తాపం కలిగించారని మండిపడ్డారు. 

Similar News