టీమిండియా కోచ్ రేసులో ఆ నలుగురు..

Update: 2019-07-17 12:25 GMT

టీమిండియా కోచ్ రావిశాస్త్రి పదవీకాలం ముగిసింది. దీంతో బీసీసీఐ కోచ్ పదవి కోసం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. రావిశాస్త్రి కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా బోర్డు సూచించిందనే వార్తలు వచ్చాయి. ఇక కోచ్ పదవి కోసం ఈసారి వయసు, అనుభవం వంటి నిబంధనల్ని విధించింది. ఇక ఈ నిబంధనలను అనుసరించి పలువురు ప్రముఖ క్రికెటర్లు ఈ పదవికి తమ దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ప్రస్తుత ఇంగ్లాండ్ కోచ్ ట్రెవర్ బేలిస్, ఆస్ట్రేలియా క్రికెటర్ టామ్ మూడీ, భారత జట్టులో ఒకప్పటి విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్, శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం మహేల జయవర్ధనే పేర్లు వినవస్తున్నాయి. కోచ్ కోసం ఈ నలుగురు, రావిశాస్త్రి (దరఖాస్తూ చేసుకుంటే) మధ్య పోటీ ఉండొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఈ నలుగురి గురించి..

వీరేంద్ర సెహ్వాగ్..

భారత్ జట్టులో విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా వెలుగు వెలిగిన క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. బ్యాటింగ్ దిట్ట. గతంలో 2017లో కూడా సెహ్వాగ్ పేరు కోచ్ ఎంపికలో ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం మళ్లీ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఓ జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్ గా వ్యవహరించిన అనుభవం లేకపోవడం సెహ్వాగ్ కు ప్రతికూల అంశం.

ఆస్ట్రేలియా క్రికెటర్ టామ్ మూడీ..

గతంలో రవిశాస్త్రితో పోటీలో తృటిలో కోచ్ పదవిని మిస్సయ్యాడు. క్రికెటర్ గా అనుభవం, ఒత్తిడిలో సైతం ప్రశాంతంగా ఉండే గుణాలు టామ్ మూడీ ప్రత్యేకతలు. ఐపీఎల్ లో సుదీర్ఘకాలంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోచ్ గా సేవలందిస్తుండడం మూడీకి అదనపు అర్హత.

శ్రీలంక బ్యాట్స్ మెన్ మహేల జయవర్ధనే..

ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న జయవర్ధనేకు అపారమైన క్రికెట్ పరిజ్ఞానం ఉంది. శ్రీలంక తరఫున టన్నుల కొద్దీ పరుగులు సాధించిన అనుభవం జయవర్ధనే సొంతం. టీమిండియా కోచ్ పదవికి ఇతను బలమైన ప్రత్యర్థిగా నిలుస్తారనడంలో సందేహం లేదు.

ఇంగ్లాండ్ జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్..

ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ పేరు కూడా టీమిండియా కోచ్ రేసులో బలంగా వినిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ లో బేలిస్ పేరు పెద్దగా వినిపించకపోయినా, కోచ్ గా మాత్రం తలపండిపోయాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రపంచవిజేతగా అవతరించంతో బేలిస్ పేరు మార్మోగిపోతోంది.  

Tags:    

Similar News