లార్డ్స్‌ పిలుస్తోంది..కీలకం కానున్న టాస్‌

Update: 2019-07-09 09:06 GMT

వరల్డ్‌ కప్‌కు అడుగుదూరంలో నిలబడ్డ భారత్‌ ఇవాళ న్యూజీల్యాండ్‌ టీమ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మాంచెస్టర్‌లో జరగనున్న ఫస్ట్‌ నాకౌట్‌లో గెలిచి లార్డ్స్‌లో సగర్వంగా అడుగుపెట్టేందుకు కోహ్లీ సేన ఉత్సాహంతో ఉంది. అయితే లీగ్‌ దశలో భారత్‌ కివీస్‌ మధ్య మ్యాచ్‌కు అడ్డంకిగా మారిన వరణుడే ఈ మ్యాచ్‌కు కూడా విలన్‌గా మారే అవకాశాలున్నాయి. మరి ఇవాళ వర్షం పడితే.. విజయం ఎవరిసొంతం అవుతుంది..? ఫైనల్‌కు చేరే జట్టేది..?

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో తొలి సెమీస్ మాంచెస్టర్‌ వేదికగా ఇవాళ జరగనుంది. టాప్‌ ప్లేస్‌లో ఉన్న కోహ్లీసేన ఫోర్త్‌ ప్లేస్‌లో ఉన్న కివీస్‌తో తలపడనుంది. గెలిచిన వారు ఫైనల్‌ లో అడుగుపెడతారు. దీంతో రెండు టీమ్‌లు సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్దమయ్యాయి. లీగ్‌ దశలో కివీస్‌, భారత్‌ మ్యాచ్‌ రద్దు కావడంతో ఈ వరల్డ్‌ కప్‌లో తొలిసారిగా పోటీ పడుతున్నాయి. దీంతో ఆట రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

అయితే మాంచెస్టర్‌ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకిగా మారనున్నట్లు తెలుస్తోంది. మంగళ, బుధవారాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళవారు చిరుజల్లులు పడతాయని బుధవారం భారీవర్షం కురిసే అవకాశం ఉందని తన ప్రకటనలో పేర్కొంది. దీంతో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనే టెన్షన్‌ పట్టుకుంది.

మంగళవారం మ్యాచ్‌ రద్దైతే బుధవారం ఆడతారు. ఆ రోజు కూడా వర్షం పడి మ్యాచ్‌ ఫలితం తేలకుంటే భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు. కోహ్లీసేన లీగ్‌ దశలో ఎక్కువ మ్యాచ్‌లు గెలచింది కాబట్టి విజేత భారత్‌ అవుతుంది. టీమిండియా 8 మ్యాచుల్లో ఏడు గెలిచి 15 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది కాబట్టి ఆ లెక్కన కోహ్లీసేనే ఫైనల్‌లో అడుగుపెడుతుంది. అయితే చిరుజల్లు పడుతూ ఉంటే బౌలర్లు పండగ చేసుకుంటారు. బంతి బాగా స్వింగ్‌ అయ్యే అవకాశం ఉండటంతో వికెట్లు త్వరగా కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో టాస్‌ కీలకం కానుంది. దీంతో వర్షం పడ్డా టీమిండియాకు వచ్చిన భయమేమీ లేదని చెబుతున్నారు. 

Tags:    

Similar News