Appanapalli Bala Balaji Temple : అప్పనపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ చరిత్ర

Appanapalli Bala Balaji Temple : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆపద మొక్కుల వాడు, అనాథ రక్షకుడు ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా ఆయన పలుకుతాడు.

Update: 2020-08-23 04:32 GMT

అప్పనపల్లి వెంకటేశ్వరస్వామి  

Appanapalli Bala Balaji Temple : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆపద మొక్కుల వాడు, అనాథ రక్షకుడు ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా ఆయన పలుకుతాడు. ఇలాంటి వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు భారత దేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ లో మలయప్ప కొలువుదీరిన ఆలయాలు మాత్రం ఎంతో సుప్రసిద్దం వాటిలొ తిరుపతి లో కొలువైన వేంకటాచలపతి ఆలయం ఖ్యాతి గాంచింది. తిరుమల క్షేత్రం దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది గాంచింది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని ఆలయాలు కూడా ప్రసిద్ది చెందాయి వాటితో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ద్వారకా తిరుమల కాగా మరొకటి తూర్పు గోదావరి కి చెందిన అప్పనపల్లి లో ఉన్నది. విశేషం ఏమిటంటే రెండు ఆలయాలు కూడా ఉభయగోదావరి జిల్లాలోనే ఉండడం విశేషం.

దేవస్థాన చరిత్ర...

ఇక్కడి వెంకటేశ్వర స్వామిని తూర్పు భారతదేశములోలా బాలాజీ అని పిలుస్తారు. పూర్వము ఉన్న దేవస్థానమును కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుచేవారు. ఈ దేవస్థాన నిర్మాత మొల్లేటి రామస్వామి. ఆయన ఒక కొబ్బరి వర్తకుడు. ఆయన శ్రీమతి వాయువేగుల శీతమ్మ ఇంట్లో కొబ్బరి వర్తకము చేయ సాగెను. ఒకరోజు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరి కాయలో శ్రీ వెంకటేశ్వరుని తిరు నామాలను కనుగొన్నారు. ఆ కొబ్బరి కాయను ప్రతిష్ఠించి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించ సాగెను. అది దిన దిన ప్రవర్ధమానమయి పెద్ద పవిత్ర క్షేత్రమయినది.

ఇక్కడ దేవాలయములో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది. ఈ ఆలయ నిర్మాణకర్త మొల్లేటి రామస్వామి, కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయములో తేడా వచ్చి కొనకుండా వెనుకకు తిరిగి వచ్చేసారు. తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదేచెట్టు విచిత్రంగా అప్పనపల్లి తీరానికి చేరింది. దాన్ని చూసిన గ్రామస్థులు దానినే ధ్వజస్తంభ నిర్మాణమునకు వాడారనీ చెపుతారు.

దేవస్థాన విశేషాలు..

అక్కడ జరిగే పూజాదులు, సేవలు, సాంసృతిక సేవా కార్యక్రమముల వలన విపరీతమైన ప్రచారం కలిగి భక్తుల రాకపోకలు విపరీతంగా సాగుతుండేవి. ఆ రోజులలో రామస్వామి యొక్క నిస్వార్థము వలన ఆదాయము బాగుగా సమకూరి తిరుమల దేవస్థానము తీరుగా వచ్చిన వారందరకూ ఉచిత భోజనము, లోపములేని వసతులు కల్పించుటతో భక్తుల రాకపోకలు విపరీతముగా పెరిగి అత్యంత పెద్ద దేవస్థానముగా రూపుదిద్దుకొన్నది. తరువాత కొంతకాలమునకు దేవస్థాన ఆదాయము అధికముగా ఉండుటవలన ప్రభుత్వ దేవాదాయశాఖ వారు దేవస్థానమును వారి ఆధీనములోకి తీసుకొన్నారు. అప్పటి నుండి వారు పాత కార్యవర్గమును రద్దుచేసి కొన్ని పూర్వ కార్యక్రమములను నిలిపివేయుటతో భక్తుల రాకపోకలు గణనీయముగా తగ్గిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందముగా భక్తుల ఒరవడి తగ్గుట ఆదాయము మందగించుటతో ఈ మధ్యనే తిరిగి యధాపూర్వకంగా పాత పద్ధతులను పునరుద్ధరించుట మొదలెట్టినారు.

పాత దేవాలయము..

ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము ఉంది. అప్పన ముని తపస్సు చేసినదిక్కడేనని అంటారు. ఇక్కడ కళ్యాణ కట్ట ఉంది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానములో దేవుని దర్శించిన పిదప కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీ దర్శనము చేసుకొనుట పరిపాటి.

ఎలా చేరుకోవాలి...

మామిడికుదురు నుండి 5 కి. మీ. దూరం లోను, అమలాపురం మీదుగా వచ్చే వారు వయా అంబాజీపేట మీదుగా 35 కి. మీ ల దూరం ప్రయాణించి అప్పనపల్లి చేరుకోవచ్చు. అమలాపురం నుండి బోడసకుర్రు ఫెర్రి ఎక్కి 13 కి. మీ దూరంలో ఉన్న అప్పనపల్లి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం :

రాజమండ్రి కి 85 కి. మీ ల దూరంలో మరియు అమలాపురం కు 35 కి. మీ ల దూరంలో కలదు.

Tags:    

Similar News