Ganesh Chaturthi 2022: వినాయక ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి..?

Ganesh Chaturthi 2022: భక్తితో కేవలం గరిక సమర్పిస్తే చాలు.. విఘ్నాలన్నింటినీ తొలగించి విజయాలను అందిస్తానని అభయమిస్తాడు.. వినాయకుడు.

Update: 2022-08-30 15:03 GMT

Ganesh Chaturthi 2022: వినాయక ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి..?

Ganesh Chaturthi 2022: భక్తితో కేవలం గరిక సమర్పిస్తే చాలు.. విఘ్నాలన్నింటినీ తొలగించి విజయాలను అందిస్తానని అభయమిస్తాడు.. వినాయకుడు. అలాంటి గణేషుడికి ఇప్పుడైతే రకరకాల ఆకృతులు, భారీ ఎత్తున మండపాలు, విద్యుత్ దీప కాంతుల్లో హంగూ ఆర్భాటంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ భారీ ఖాయుడు ఎంత ఎత్తు ఉంటే అంత పేరు. మరి ఒకప్పుడు ఈ వినాయక ఉత్సవాలు ఎలా ఉండేవి..? నవరాత్రుల సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది..? భక్తితో పాటు స్వాతంత్య్ర కాంక్ష కూడా దాగున్న చరిత్ర ఏంటి..?

ఆది దంపతుల ముద్దుల గారాల పట్టి.. ఎప్పుడూ తల్లి ఒడిలోనే కనిపించే అరుదైన రూపసి.. ఆకట్టుకునే రూపమే కాదు.. అభయమిచ్చే వరప్రదాయని.. బొజ్జ గణపయ్య. ఏ పూజ చేయాలన్నా.. దేవుడిని ఏది కోరుకోవాలన్నా.. ముందుగా ఆ వినాయకుడి అనుమతి తీసుకోవాలి. అలాంటి వినాయకుడిని నవరాత్రుల పాటు పూజించే సంప్రదాయం చాలాకాలంగా కొనసాగుతూ వస్తోంది. భారీ ఎత్తున మండపాలు ఏర్పాటు చేయడమే కాదు వెరైటీ రూపాల్లో విగ్రహాలను పూజించడం కూడా ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. రకరకాల ఆకృతుల్లో తయారు చేయడం ముచ్చటగొలుపుతుంది. సమకాలీన అంశాలతో కూడిన విగ్రహాలు తయారు చేయడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఇక వినాయకుడి ఎత్తు కూడా అందరిలో ఆసక్తిని రేపే అంశంగా మారింది. ఎంత ఎక్కువ ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అంత ప్రచారం వస్తుంది. ఇప్పటికీ దేశంలో రకరకాల ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వినాయకుడి వల్లే ఆయా ప్రాంతాలకు ఆ పేరు స్థిరపడిపోయింది.

అసలు వినాయకుడి రూపమే విపరీతంగా ఆకట్టుకుంటుంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఏకదంతుడిని ఇష్టపడని వారంటూ ఉండరు. అందుకే మనదేశంలో అతిముఖ్యమైన పండగల్లో ఒకటైన వినాయకచవితిని భారతీయులంతా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఈ పండగకు పురాణాల్లో ఎలా అయితే ప్రాముఖ్యత ఉందో నవరాత్రి ఉత్సవాలకు కూడా చారిత్రక నేపథ్యం ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం హిందువులను ఏకం చేసే వేదికలుగా వినాయక మండపాలు ఉండేవి. అప్పట్లో అప్పుడు మనదేశాన్ని ఏలుతున్న బ్రిటీష్ ప్రభుత్వం హిందువుల సమావేశాలపై ఆంక్షలు విధించింది. స్వాతంత్య్రం కోసం ఎక్కడైనా కూడి సమావేశాలు ఏర్పాటు చేసి తమపై తిరుగుబాటు చేస్తారనే భయంతో ఈ నిషేధాలు అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా సామాజిక, రాజకీయ సమావేశాలను ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో భారతీయులు ముఖ్యంగా హిందువులు ఒకచోట కలిసే అవకాశం లేకుండా పోయింది. బ్రిటీష్ రూల్స్‌ను తప్పించుకునేందుకు అప్పటి మహారాష్ట్రకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్‌ సరికొత్త సంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సామాజిక, రాజకీయ సమావేశాలపై ఆంక్షలు పెడితే ఆయన ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నారు. అప్పటివరకు హిందువులంతా ఇళ్లల్లోనే ఐకమత్యంగా చేసుకునే వినాయక చవితిని సామాజిక పండగగా మార్చారు. 1892 నుంచి చవితి వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. 9 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకోవాలని నిర్దేశించారు.

అప్పటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగించడానికి ప్రజల్లో జాతీయ భావం, ఐకమత్యం పెంపొందించడానికి వినాయక చవితి పర్వదినాన్ని జాతీయ సమాఖ్య పండగగా చవితి వేడుకను జరిపారు. పేద‌, ధ‌నిక‌, వ‌ర్ణ భేదాలు లేకుండా అంద‌రూ ఏకతాటి పైకొస్తారని ఆశించారు. సామూహికంగా వేడుక‌ల‌ను జ‌రుపుకుంటే ప్రజల మధ్య ఎలాంటి తార‌త‌మ్యాలు ఏర్పడవని తిలక్‌ నమ్మారు. అంతా ఐక‌మ‌త్యంగా ఉండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని తిలక్ విశ్వసించారు. అలా చవితి వేడుక‌ల‌ను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ ఉత్సవాల ద్వారా ముఖ్యంగా హిందువుల్లో ఐకమత్యం పెంపొందించబడింది. 9 రోజుల పాటు దేశంలోని మిగతా చోట్ల జరుగుతున్న ఉద్యమం గురించి చర్చించుకునే వేదికగా వినాయక మండపాలు ఉండేవి. నవరాత్రులు ముగిశాక సమీపంలోని నదిలో లేదా సముద్రంలో విగ్రహాన్ని నిమజ్జనం చేయడం కూడా అప్పటి నుంచే ప్రారంభమైంది. ప్రస్తుత చవితి ఉత్సవాలకు మూలం తిలక్‌ తీసుకొచ్చిన సంప్రదాయమే అని చెప్పుకోవాలి.

అలా వినాయక చవితి ఉత్సవాల ద్వారా ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ఏటా నిర్వహించే చవితి నవరాత్రుల కోసం చాలామంది ఎదురుచూసేవారు. ఇదే కాలక్రమంలో స్వాతంత్య్ర ఉద్యమం మరింత తీవ్రమయ్యేందుకు దోహదపడింది. భారతీయుల పూజా మందిరాల్లో నిర్వహించుకునే గణేశ పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో బాలగంగాధర తిలక్‌ చేసిన కృషి అనన్య సామాన్యమైనదిగా కొనియాడబడుతోంది. అయితే వినాయకుడి పండగ నేపథ్యం కూడా క్రీస్తుపూర్వమే ఉన్నట్లు చరిత్ర రికార్డుల్లో ఉంది. క్రీస్తుపూర్వం 271 నుంచే వినాయకుడిని పూజించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పట్లో మనదేశాన్ని పాలించిన శాతవాహనులు, చాళుక్యులు కూడా వినాయకుడిని పూజించేవారు. ఆ తర్వాత చక్రవర్తి శివాజీ కూడా వినాయకుడిని తన ఇష్టదైవంగా పూజించినట్లు చరిత్రకారులు చెబుతారు.

Tags:    

Similar News