కుక్కలను చంపాలనుకున్నాడు.. పులులు చనిపోయాయి

Update: 2019-07-10 02:56 GMT

ఇటీవల చంద్రపూర్‌ ప్రాంతం (మహారాష్ట్ర) చిమూర్‌ అటవీ క్షేత్రంలోని శంకరాపూర్‌ వద్ద ఒక పెద్ద పులి, రెండు పులి పిల్లలు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై జరిపిన దర్యాప్తులో పులుల చావుకు కారణం తెలిసింది. ఇక్కడి మెటెపార్‌ గ్రామంలోని పాండురంగ అనే రైతు..కుక్కలను చంపేందుకు వీలుగా చనిపోయిన ఆవుదూడపై విషం చల్లాడని, అది తినడం వల్లనే పులులు మృతిచెందాయని అటవీశాఖ అధికారుల విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. అతడికి న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్‌ విధించింది. పాండురంగ తన వ్యవసాయ భూమిలో ఆవులను పెంచుకుంటున్నాడు. ఆ పొలంలోకి గ్రామానికి చెందిన కొన్ని పెంపుడు కుక్కలు వచ్చి, ఆవుదూడపై దాడిచేసి చంపేశాయి. ఆగ్రహించిన అతడు మృతిచెందిన ఆవుదూడపై విషం పోసి వచ్చాడు. ఆ గ్రామం తాడోబా అభయారణ్యాలకు సమీపంలో ఉండటంతో పులి తన ఎనిమిది, తొమ్మిది నెలల పిల్లలతో ఆహారం కోసం సంచరిస్తూ వచ్చింది. ఆకలితో ఉన్న అది తన పిల్లలతో పాటు ఆవుదూడ మాంసాన్ని తింది. విషప్రభావంతోనే అవి మూడూ మృతి చెందాయని ధ్రువపడింది. అటవీ శాఖమంత్రి సుధీర్‌ విచారణకు ఆదేశించడంతో, అటవీ అధికారులు రంగంలోకి దిగడం వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చిందని బ్రహ్మపురి డీఎఫ్‌వో కులరాజ్‌సింగ్‌ తెలిపారు.

Tags:    

Similar News