Supreme Court: మణిపూర్ హింసపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు..
Supreme Court: ఎఫ్‌ఐఆర్ నమోదుకు 14 రోజుల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్న
Supreme Court: మణిపూర్ హింసపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు..
Supreme Court: మణిపుర్ హింసపై, మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. మణిపూర్ హింసను అత్యంత భయంకరమైన పరిణామంగా పేర్కొంది. మణిపుర్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో, రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘర్షణలపై దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. సాయుధ మూకలకు మహిళలను పోలీసులే అప్పగించారన్న వార్తలు తమను తీవ్రంగా కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేసింది.
మే 4న సంఘటన జరిగితే మే 18న ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. FIR నమోదుకు 14 రోజుల సమయం ఎందుకు పట్టిందని పోలీసులను నిలదీసింది. జాతుల మధ్య కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతున్న ఘర్షణల మధ్యలో మణిపూర్‌లో మహిళపై దారుణాలు చోటు చేసుకున్నాయని సీజేఐ పేర్కొన్నారు. మణిపుర్ ఘటన.. నిర్భయ కంటే ఘోరమన్నారు. సాయుధమూకలకు తమను పోలీసులే అప్పగించారని బాధితులు వాంగ్మూలం ఇచ్చారని.. ఇది నిర్భయ లాంటి ఘటన కాదని సీజేఐ తెలిపారు.
విచారణ సందర్భంగా మణిపుర్ ప్రభుత్వ తీరుపై సీజేఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదులో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. మొత్తం ఎన్ని FIRలు నమోదు చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతాను ప్రశ్నించారు. ఇద్దరు మహిళలపై లైంగిక హింసకు సంబంధించి 20... రాష్ట్రవ్యాప్త హింసపై 6వేల FIRలు నమోదు చేశామని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. అందులో జీరో ఎఫ్‌ఐఆర్‌లు ఎన్ని? లైంగిక హింసకు సంబంధించినవి ఎన్ని? హత్య, ఆస్తుల ధ్వంసం నేరాలెన్ని? అని సీజేఐ ప్రశ్నించారు. ఆ సమాచారం లేదని మెహతా తెలపడంతో సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తదుపరి విచారణకు అన్ని వివరాలతో రావాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ ఘటనలను ప్రత్యేక నేరంగా పరిగణించాలని సీజేఐ అన్నారు. ఇందుకు ప్రత్యేక బృందం ఉండాలన్న సీజేఐ.. మణిపూర్‌లో మారణకాండపై విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ లేదా.. సిట్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తునకు తమకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ మెహతా తెలిపారు. విచారణను సమయానుకూలంగా ముగించడానికి మణిపుర్ వెలుపలకు విచారణను బదిలీ చేయాలని కోరారు. అయితే ఆ విషయాన్ని తర్వాత చూద్దామని సీజేఐ బదులిచ్చారు. మే 4న వెలుగులోకి వచ్చిన వీడియోల్లోని బాధిత మహిళల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సీబీఐపై తమకు నమ్మకం లేదని తెలిపారు. సీబీఐకి కేసు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దాడి చేసిన మూకల దగ్గరకు మహిళలను పోలీసులే తీసుకెళ్లి అప్పగించారని తెలిపారు. బాధితుల్లోని ఒక మహిళ తండ్రి, సోదరుడిని కూడా చంపేశారని, వారి మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదన్నారు. నిందితులతో కుమ్మక్కయిన పోలీసులు ఇచ్చిన వివరాలతో ఎలా ఆధారపడాలని ఆయన ప్రశ్నించారు.