తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై సంచలనాలు

Update: 2019-11-19 15:15 GMT
రజనీ కాంత్, కమల్ హాసన్

తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరు అగ్రనటులు కలసి పనిచేసేందుకు సమాయత్తమవుతున్నారు. తమిళ తలైవా రజనీ, విశ్వ నటుడు కమల్ హాసన్ కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మక్కల్ నీది మయ్యం పార్టీతో రాజకీయాల్లోకి దిగిన నటుడు కమల్ హాసన్ అవసరమైతే వచ్చే ఎన్నికల్లో రజనీకాంత్ తో కలసి పనిచేసేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించారు. కమల్ హాసన్ చేసిన ఈ ప్రకటన తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. దీనికి ప్రతిగా రజనీకాంత్ కూడా సై అన్నారు. ప్రజా సంక్షేమమే తమ ఇద్దరి ధ్యేయం కాబట్టి కమల్ తో కలసి పనిచేయడానికి తానెప్పుడూ సిద్ధమేనని రజనీకాంత్ ప్రకటించారు. చెన్నై విమానాశ్రయంలో ఇద్దరూ విడి విడిగా మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

గత కొంత కాలంగా రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం దోబూచులాడుతూ వస్తోంది. రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించి ఆ తర్వాత సైలెంట్ అయిపోడం కామన్ అయిపోయింది. తమిళనాడులో ఉనికే లేని బీజేపీ రజనీ కాంత్ ను తమ పార్టీలోకి లాక్కోడానికి చాలా ప్రయత్నాలే చేసింది. అయినా రజనీ ఎక్కడ తొణకలేదు గతంలో కమల్ హాసన్ పార్టీ పెట్టడంపైనా రజనీకాంత్ స్పందించారు. కమల్ హాసన్ కు అంత ఓపిక, సహనం ఉన్నాయని తాననుకోవడం లేదన్నారు. కానీ కమల్ మాత్రం ఎవరేమనుకున్నా తన అడుగు ముందుకేనని తేల్చేశారు. మక్కల్ నీది మయ్యం పార్టీని పెట్టి మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్క సీటు గెలవనప్పటికీ తన పార్టీని నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలసి పనిచేసేందుకు తాను సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించారు.

ఇదే ఆలోచనతో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కమల్ కలుసుకున్నారు. ఒడిషా వెళ్లిన కమల్ కు అక్కడ సీఎం నవీన్ నుంచి సాదర స్వాగతం లభించింది. అయిదుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన నవీన్ నుంచి తాను నేర్చుకోవలసినది ఎంతో ఉందన్న కమల్ నవీన్ రాజకీయ శైలిని గమనించడానికే తాను ఒడిషా వచ్చానన్నారు. సో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వీరిద్దరూ కలసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా కమల్, రజనీ తాజా ప్రకటనలతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కుతున్నాయి. కమల్, రజనీ జుగల్బందీ లో ఏర్పడే పొత్తుపైనే ఇప్పుడు అందరి చూపు ఉంది.



Tags:    

Similar News