పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు

Update: 2019-08-03 03:03 GMT

ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దుపై కేంద్రం స్పందించింది పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు అత్యంత బాధాకరమని జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు టెండర్ల రద్దు ప్రభావం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం కాంట్రాక్టర్‌ను తప్పుకోవాలని ఆదేశించడం వల్ల ప్రాజెక్టుకు పెద్ద అవరోధంగా మారుతుందని అభిప్రాయపడింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్‌సభలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలవరానికి కొత్త టెండర్లు పిలిస్తే.. మళ్లీ వాటి వ్యయం పెరుగుతుందని, అప్పుడు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేమని ఆయన అన్నారు.

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని కేంద్రాన్ని కొందరు అడుగుతున్నారని, అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. పోలవరం కాంట్రాక్టు పనులు చేస్తున్న నవయుగ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ ఇరిగేషన్ శాఖ నోటీసులు ఇచ్చింది. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని సంప్రదించి సెటిల్ చేసుకోవాలని సూచించింది కేంద్రం..

చంద్రబాబు హయాంలో కట్టబెట్టిన ప్రాజెక్టుల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత బాబు హయాంలో ఇచ్చిన కాంట్రాక్టుల నిగ్గు తేలుస్తామంటూ ఓ నిపుణుల కమిటీని నియమించారు. పోలవరంతో పాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులను కమిటీ పరిశీలించింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా నవయుగ కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

నామినేషన్‌ ప్రాతిపదికపై పనులు అప్పగించడం సరైనది కాదన్న కారణంతోనే వారిని ప్రస్తుతం పనుల నుంచి తొలగిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.. అయితే ఈ పనులను అప్పగించేందుకు కొత్తగా పిలవనున్న టెండర్లలో నవయుగ సంస్థ పాల్గొనవచ్చని చెప్పారు. మరోవైపు కేంద్రం తాజాగా మరోసారి పోలవరం టెండర్లను రద్దు చేయడం సరైనది కాదంటూ తెలిపింది.

Tags:    

Similar News