మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు వీడిన ప్రతిష్టంభన

Update: 2019-11-10 02:04 GMT
Maharashtra governor invited the BJP

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నెల 11 తేదీలోపు అసెంబ్లీలో బలన్ని నిరూపించుకోవాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులేస్తోంది.

మహారాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటు ప్రతిష్టంభన వీడుతోంది. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సందేశం పంపారు. ఈనెల 11వ తేదీ ఉదయం 8గంటలకు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని, ఆ వెంటనే బలనిరూపణ చేసుకోవాలనీ గవర్నర్ ఆదేశించారు. దీంతో 15రోజులకు పైగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గడువు కూడా తీరిపోవడంతో సంక్లిష్టంగా మారిన ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారంపై గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సీఎం పదవికోసం అటు బీజేపీ, ఇటు శివసేన మంకు పట్టు పట్టడంతో చర్చలు ఫలించలేదు.. రొటేషన్ పద్ధతిలో సీఎం పదవిని తీసుకోవాలన్న శివసేన ప్రతిపాదనలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో చర్చల్లో అడ్డంకి ఏర్పడింది. ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కారంటూ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. ఒక దశలో కాంగ్రెస్,ఎన్సీపీతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడ్డారు. దీనికి ఎన్సీపి అధినేత శరద్ పవార్ సైతం ఓకే చెప్పారు. అయితే మిత్రపక్షమైన కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే కూర్చుందామని తేల్చి చెప్పడంతో పవార్ వెనకడుగేశారు. దాంతో ఒంటరిదైపోయిన శివసేన... అటు బీజేపీ ఆధిపత్యాన్ని భరించలేక, ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేసే దారి లేక చర్చల్లో డెడ్ లాక్ ఏర్పడింది. చివరకు ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమేనని బీజేపీ గవర్నర్ ను కలవడంతో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకున్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం బీజేపీకి కనీసం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. అయితే తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలు తన సంప్రదింపుల్లోనే ఉన్నారని దేవేంద్ర ఫడ్నవిస్‌ భావిస్తున్నారు. దీంతో వీరితో పాటు మరో 24 మందిని ఎలాగైనా తమవైపు తిప్పుకుని అధికారం చేపట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు. గవర్నర్‌ కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో కీలక పరిణామాలు చేటుచేసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News