India Elections 2024: పోల్ మేనేజ్‌మెంట్‌ను ఎలా చేస్తారు.. పార్టీలకు ఉన్న లెక్కలేంటి?

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌‌తో పార్టీలు ఏ మేరకు సక్సెస్ అవుతున్నాయి?

Update: 2024-05-09 15:00 GMT

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌ను ఎలా చేస్తారు.? పార్టీలకు ఉన్న లెక్కలేంటి?     

Poll Management: ఎన్నికల యుద్ధంలో పోల్‌ మేనేజ్‌మెంట్ అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. ఇక్కడ విఫలమైతే.. ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధాన పార్టీలన్నీ ప్రచారం ముగిసినప్పటికీ ఓట్లు జరిగే వరకు అలర్ట్ గా ఉంటాయి. మరి ప్రచారం అనంతరం పోల్ మేనేజ్‌మెంట్‌ను ఎలా చేస్తారు.? పోల్ మేనేజ్‌మెంట్‌కు పార్టీల వ్యూహాలు ఎలా ఉంటాయి? 

ఎన్నిక ఏదైనా సరే పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకోలేకపోతే ఎంతటి నేతైనా గెలిచేది అనుమానమే. అందుకనే పోలింగ్‌కు ముందు పార్టీ అన్ని పోల్ మేనేజ్మెంట్‌పై ఫోకస్ పెడుతుంటాయి. ఈ పోల్ మేనేజ్ మెంట్‌లో ఒక్క పార్టీ ఒక్కో స్టాటజీని అవలంభిస్తుంటుంది. ఓటర్లను ఏ,బీ,సీ అని మూడు వర్గాలుగా విడదీసి... వర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను లెక్కలు వేస్తుంటారు. ఏ కేటగిరిలో ఓటర్లంటే పార్టీకి సంబంధించిన ఓటర్లు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పార్టీ నేతల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, బాగా దగ్గరి వాళ్ళు. అలాగే పార్టీ సానుభూతిపరులు, పార్టీ మద్దతుదారులు కూడా ఏ కేటగిరి లోకి వస్తారు. ఇక బీ కేటగిరి అంటే తటస్ధ ఓటర్లన్నమాట. వీళ్ళు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. పైగా రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేనివాళ్ళు. వీళ్ళ మొగ్గే చాలా కీలకం. వీళ్ళు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీదే గెలుపని పార్టీలు భావిస్తుంటాయి.

ఇక సీ అంటే మూడోవర్గం ఓటర్లు. వీరు అధికారపార్టీ వ్యతిరేక ఓటర్లన్నమాట. వివిధ కారణాలతో వీళ్ళు అధికారపార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసే వాళ్ళుండచ్చు లేదా ఇతర పార్టీల మద్దతుదారులు కూడా అయ్యుండచ్చు. పార్టీలన్ని ప్రధానంగా చివరి రెండు కేటగిరిలు అంటే బీ,సీ వర్గాల ఓటర్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టి పోల్ మేనేజ్‌మెంట్ చేస్తుంటాయి. బీ,సీ కేటగిరీలకు సంబంధించిన ఓటర్లపై ఎక్కువగా దృష్టిపెట్టి రెండుమూడుసార్లు కలిసి ఓట్లు వేయమని విజ్ఞప్తులు చేస్తుంటారు పార్టీల ప్రతినిధులు. ఈ వర్గాలను రెండుమూడు విడతలుగా కలవటం ద్వారా తటస్ధ ఓటర్లు, ప్రత్యర్ధి పార్టీలకు చెందిన ఓటర్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలుంటాయని... పార్టీలు భావిస్తుంటాయి.

ఆయా పార్టీల నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకునే చాన్స్ ఇవ్వరు. బూత్‌ల వారీగా ఇన్​చార్జిలను, కో ఇన్​చార్జిలను పార్టీలు నియమించుకుంటాయి. వారితో నిత్యం టచ్​లో ఉంటూ ఏర్పాట్లను చేస్తుంటాయి. గ్రౌండ్ లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటాయి. పాత, కొత్త ఓటర్లు అనే తేడా లేకుండా.. ఓటర్లంతా కచ్చితంగా ఓటేసేలా చూసేందుకు పార్టీలు దిశానిర్దేశం చేస్తాయి. బూత్‌ కమిటీ ఇన్​చార్జిలు, సభ్యులు ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడతారు.

దూర ప్రాంతాల్లో ఉన్న వారితో కూడా క్షేత్రస్థాయిలోని నేతలు సంప్రందింపులు జరుపుతుంటారు. తమకు అనుకూలంగా ఉంటారు అనిపిస్తే చాలు.. నిత్యం వాళ్లతో టచ్​లో ఉంటూ పోలింగ్ కేంద్రాలకు రప్పించే దిశగా పావులు కదుపుతుంటారు. ఎన్నికల ప్రక్రియలో ఒక్క ఓటు కూడా కీలకంగా కావటంతో చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని పార్టీలు భావిస్తున్నాయి. అధినాయకత్వాలు ఇచ్చే టాస్క్ లను ఎప్పటికప్పుడూ పూర్తి చేసి.. సఫలీకృతం కావాలని గ్రౌండ్ లోని నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓటర్ జాబితాలోని పేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. ఎవరికి వారిగా లెక్కలు వేసుకుంటారు.

ఇదంతా ప్రచారం ముగిసిన తర్వాత తంతు.. ప్రచారం జరిగే సమయంలో పోలింగ్ దగ్గరపడుతుండగా కూడా అభ్యర్థులు పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌కు అనేక ఎత్తులు వేస్తుంటాయి. గంప గుత్తగా, సింగిల్‌గా ఓట్లు రాబట్టుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటారు. పోలింగ్‌ బూత్‌స్థాయిలో విందులు ఇస్తుంటారు. కుల, వృత్తి, యువజన సంఘాలు, అసోసియేషన్లు, కార్మిక సంఘాలు, ఇతర సంఘాల వారీగా విందులు నిర్వహిస్తూ గంపగుత్తగా ఓట్లు రాబట్టేందుకు శ్రమిస్తారు. ఓటర్లకు డబ్బులు నేరుగా చేరేందుకు, వ్యవహారం సాఫీగా సాగేందుకు బంధువులు, నమ్మకమైన వ్యక్తులకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తారు.

అభ్యర్థి టికెట్ దక్కించుకోవడం, ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే.. ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లును పోలరైజ్ చేసి.. తమకు ఓటు వేసే విధంగా చేయడం మరో ఎత్తు. ఈ పోల్ మేనేజ్‌మెంట్‌లో ఎవరు సక్సెస్ అయితే వాళ్లకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలా సార్లు నిరూపితమైంది. 

Tags:    

Similar News