నిండు గ్లాసు వద్దు.. సగమే ముద్దు!

Update: 2019-07-19 09:53 GMT

నీటి ఎద్దడి రోజురోజుకూ ఎక్కువైపోతోంది. ప్రస్తుతం మన దేశంలో చాలా ప్రాంతాల్లో నీటి కోసం ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. చెన్నైలో నీటి కటకట చూసిన తరువాత నీటిని పొదుపుగా వాడాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పటికీ చాలా మంది నీటిని యధేచ్చగా వృధా చేస్తూనే ఉన్నారు.

దీనిని గమనించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నీటిని పొదుపుగా వాడటానికి చర్యలు ప్రారంభించింది. తాము ఆచరించి చూపితే ప్రజలు కూడా అదే పని చేస్తారని ఆ ప్రభుత్వం నమ్ముతోంది. రాష్ట్ర సచివాలయంలో ఉండే గ్లాసుల్లో నీటిని సగమే నింపి పెట్టాలని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఆదేశించారు. దీంతో ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రదీప్ దుబే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

''సాధారణంగా మంచినీరు గ్లాసు నిండుగా పోసి ఇస్తుంటారు. దానిలో సగం తాగి మిగిలిన నీళ్ళు పారబోస్తారు. దాంతో నీటి వృధా మనకు తెలీకుండానే ఎక్కువగా ఉంటుంది. గ్లాసులో సగం మాత్రమె నీరు నింపాలని స్పీకర్ ఆదేశించారు. అందువల్ల సెక్రటేరియట్, ఇతర విభాగాల కార్యాలయాల్లోనూ ఏర్పాటు చేసే గ్లాసుల్లో ఇకపై సగం నీరు మాత్రమె నింపాలి. వారు తాగుతామంటే మరిన్ని నీళ్ళు ఇవ్వవచ్చు.'' అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

యూపీ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం అందరూ ఆచరించదగినదే!

Tags:    

Similar News