Mamata Banerjee: ఐ-ప్యాక్ ఆఫీసుపై ఈడీ దాడులు.. పత్రాలను వెనక్కి తెచ్చుకున్న దీదీ!
Mamata Banerjee: కోల్‌కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ సంస్థపై గురువారం ఉదయం ఈడీ దాడులు చేసింది.
Mamata Banerjee: కోల్‌కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ సంస్థపై గురువారం ఉదయం ఈడీ దాడులు చేసింది. ఐ-ప్యాక్ సంస్థకు చెందిన కీలక అధికారి ప్రతీక్ జైన్ ఇంటితోపాటు, వి.సాల్ట్ లేక్ లోని ఐ-ప్యాక్ ఆఫీసుపై కూడా ఈడీ దాడులు కొనసాగిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ సోదాలు జరుపుతోంది. ప్రతీక్ జైన్.. మమత ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీ కోసం పని చేసే కీలక వ్యక్తి. టీఎంసీ కోసం రాజకీయ వ్యూహాలు రచిస్తుంటారు.
దీంతో తనకు అనుకూలమైన ప్రతీక్ జైన్ ఇల్లు, కార్యాలయంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాడులు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. దాడులు జరుగుతున్న సమయంలోనే మమత, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లారు. తన పార్టీకి సంబంధించిన కీలక పత్రాల్ని తాను తీసుకున్నట్లు మమత తెలిపారు. తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల వివరాలు, రాజకీయ, ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీ ఈ దాడులు చేస్తోందని మమత ఆరోపించారు. తాము కూడా బీజేపీ ఆఫీసుపై దాడులు చేస్తే ఎలా ఉంటుంది అని మమత ప్రశ్నించారు. తన చేతిలో ఒక ఫైల్ తో మమత మీడియాతో మాట్లాడారు. అలాగే, ఐ-ప్యాక్ ఆఫీసుకు కూడా ఆమె చేరుకున్నారు. ఈడీ దాడులు జరుగుతుండగా.. ఆఫీసు బయట టీఎంసీ కార్యకర్తలు అక్కడ నిరసనలు చేస్తున్నారు.
మరోవైపు ఐ-ప్యాక్ ఆఫీసు వద్ద కేంద్ర బలగాల్ని కూడా మోహరించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా పరిస్తితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఈడీ దాడులు జరుగుతున్న వ్యక్తి ఇంటికి సీఎం వెళ్లడాన్ని ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికార్ ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విధులకు మమత ఆటంకం కలిగించడం పనిగా పెట్టుకుందని, ఆమెపై ఈడీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మమత చర్య అనైతికం అని మండిపడ్డారు.