గుజరాత్‌లో వరద బీభత్సం.. బొమ్మల్లా కొట్టుకుపోతున్న కార్లు
Gujarat: నగరాలను సైతం నీట ముంచుతున్న కుండపోత వర్షాలు
గుజరాత్‌లో వరద బీభత్సం.. బొమ్మల్లా కొట్టుకుపోతున్న కార్లు
Gujarat: గుజరాత్‌ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు నగరాలను సైతం నీట ముంచుతున్నాయి. వరద నీటితో నదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. నవసారి, జునాగఢ్, ద్వారక, భావనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసాయి. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్షం కుంభవృష్టి సంభవించింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కాలనీల్లో ప్రవహించే వరద నీరు నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది. వరదల్లో వస్తువులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. నవసారి జిల్లాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. కాలనీలు వరద నీటితో బురదమయంగా మారాయి. జునాగఢ్‌లోనూ అదే పరిస్థితి.
నవసారిలో 30.3 సెంటీమీటర్ల వర్షం సంభవించగా.. జునాగఢ్‌లో 21.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జులై 24 వరకు సౌరాష్ట్రలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ పక్కనే ఉన్న మహారాష్ట్రలోనూ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. మహారాష్ట్రాను కుంభవృష్టి అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.