ఎండలు మండిపోతున్నాయని.. 144 సెక్షన్ అమలు

Update: 2019-06-18 04:09 GMT

సాధారణంగా ఎక్కడైనా అల్లర్లు, ఆందోళనకర పరిస్థితులు నెలకొంటే 144 సెక్షన్ విధిస్తుంటారు. ప్రజలు గుంపులుగా తిరగడంపై నిషేధాజ్ఞలు విధిస్తారు. కానీ బీహర్‌లో మాత్రం సీన్‌ రివర్స్‌ అయింది. ఇవేవీ లేకుండానే 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు.ఎండలు మండిపోతుండటంతో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. గత కొన్నిరోజులుగా ఎన్నాడు లేని విధంగా బీహార్ లోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల పైన నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. పట్టపగలే భానుడు చుక్కలు చూపిస్తున్నారు. సూరీడు సెగకు అల్లాడిపోతున్నారు. నిప్పుల కొలిమిని తలపిస్తుండటంతో చిన్నా పెద్దా మలమల మాడిపోతున్నారు. దీంతో ప్రచండ భానుడి కిరణాల నుంచి తప్పించుకునేలా 144 సెక్షన్‌ విధించారు. ప్రజలను బయటకు రానియొద్దనే ఉద్దేశంతోనే 144 సెక్షన్‌ విధించినట్లు అధికారులు, పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు వడదెబ్బ కారణంగా 76 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ప్రజల సంచారంపై ఆంక్షలు విధించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో తిరగడంపై నిషేధాజ్ఞలు విధించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నివాసాల్లోనే ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.ఈ సమయంలో ఎలాంటి నిర్మాణ పనులు కూడా చేపట్టొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే వారు ఉదయం 10:30 గంటల వరకు తమ నివాసాలకు తిరిగి రావాలని సూచించారు. అంతేగాకుండా, పాఠశాలలను ఈ నెల 22 వరకు మూసివేయాలని ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ కార్యకలాపాలు, ఆఫీసులు, సాంస్కృతిక వ్యవహారాలు నిలిపివేయాలని స్పష్టం చేశారు. జూన్ నెల సగం ముగిసిన చాలా రాష్ట్రాల్లో ఇంకా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రుతుపవనాల ప్రవేశం ఆలస్యం కావడంతో భానుడు రెచ్చిపోతున్నాడు. ఉత్తర భారతంలో వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు వరుసగా 32రోజుల పాటు వడగాలులు వీచాయని ఐఎండీ తెలిపింది. 1988లో రికార్డు స్థాయిలో 33 రోజుల పాటు వడగాలులు వీచాయని ఈ రికార్డు ఈ ఏడాది కనుమరుగు కానుందని వెల్లడించింది. 

Similar News