లాక్‌డౌన్‌తో దేశ వ్యాప్తంగా ఉద్యోగాల్లో భారీగా కోతలు : సీఐఐ

Update: 2020-04-06 09:11 GMT

కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ఉద్యోగాల్లో భారీగా కోతలు ఉండనున్నట్లు సీఐఐ స్పష్టం చేసింది. గతవారం 200 మందికిపైగా సీఈఓలతో ఆ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత అనేక రంగాల్లో ఉద్యోగ కోతలు ఉండనున్నట్లు సీఈవోలు చెప్పినట్లు సీఐఐ వెల్లడించింది. పరిశ్రమలపై కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం ఏ మేర పడనుందో సీఈవోల స్నాప్‌పోల్‌ పేరిట సీఐఐ ఓ సర్వే నిర్వహించింది.

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత15 శాతం కంటే తక్కువ ఉద్యోగ కోతలు ఉంటాయని 47శాతం మంది సీఈఓలు తెలిపినట్లు సీఐఐ వెల్లడించింది. 15 నుంచి 30 శాతం వరకూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని మరో 32 శాతం మంది చెప్పారు. ఇక ఆదాయం విషయానికి వస్తే 10 శాతానికి పైగా క్షీణత ఉంటుందని, లాభంలో 5 శాతం కన్నా ఎక్కువే క్షీణత ఉంటుందని పలు సంస్థలు వెల్లడించాయి. పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉందని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్‌ మోడ్‌లో దాన్ని అమలు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆకస్మికంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమల కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నాయని చెప్పారు.


Tags:    

Similar News