వివేకానందరెడ్డి మృతితో వైసీపీ శ్రేణుల దిగ్ర్భాంతి

Update: 2019-03-15 02:44 GMT

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. పులివెందులలోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.

1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకానందరెడ్డి జన్మించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిన్నతమ్ముడైన వివేకకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. గతంలో ఆయన కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు. 1989, 1994లలో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగానూ సేవలందించారు.

వివేకానందరెడ్డి అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. వైఎస్ వివేకానందరెడ్డి సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. వై.ఎస్. మరణానంతరం ఏర్పడిన కిరణ్‌ కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన వివేకా ఆ తర్వాత పులివెందులకు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఆయన వదిన విజయమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం విభేదాలకు స్వస్తి పలికి కుటుంబానికి దగ్గరయ్యారు. వైసీపీలో చేరిన వివేకా పార్టీ తరఫున పులివెందులలో నిన్న కూడా ప్రచారం చేసినట్టు తెలుస్తోంది.

ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారని ఈ నెల 3న వై.ఎస్.వివేకానందరెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఆయన హఠాన్మరణంతో జగన్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. బాబాయి మరణవార్త తెలియగానే హుటాహుటిన లోటస్‌పాండ్‌ నుంచి పులివెందులకు జగన్ కుటుంబ సభ్యులు బయల్దేరారు. 

Similar News