వివేకా మృతిపై అనుమానాలు...రంగంలోకి డాగ్ స్క్యాడ్!

Update: 2019-03-15 06:19 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉండటం, ఆయన తల, చేతులకు బలమైన గాయాలు ఉండటంతో మృతి వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తూ పీఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ పోస్టుమార్టం జరుగుతోంది. నిన్నంతా ఎంతో ఉత్సాహంగా ప్రజలతో మమేకమైన ఆయన అంతలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం వైసీపీ నేతలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మరోవైపు, వైఎస్ వివేకా మరణంపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఆయన విగతజీవిగా ఉన్న ప్రదేశంలో రక్తపు మరకలు కనిపించడంతో, ఉన్నతాధికారులు డాగ్ స్క్వాడ్ ను రప్పించారు.

బాత్‌రూమ్‌లో ఆయన జారిపడి ఉండవచ్చని, ఆ సమయంలో తలకు గాయమైనట్టు పోలీసులు భావిస్తున్నా, ఐపీసీ సెక్షన్ 175 కింద మాత్రం కేసు నమోదు చేశారు. పోలీసులు వచ్చేసరికే ఆయన నివాసం బంధువులు, కార్యకర్తలతో నిండిపోయింది. దీంతో డాగ్ స్క్వాడ్ వల్ల ఉపయోగమేమీ ఉండక పోవచ్చని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే కేసు విచారణను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశాన్ని పరిశీలిస్తామని కడప ఎస్పీ వెల్లడించారు. అయితే, ఇటీవల వివేకానందరెడ్డి గుండెపోటుకు గురికావడంతో స్టెంట్ వేయించుకున్నారు. గత కొంతకాలంగా ఆయన అధిక రక్తపోటుతోనూ బాధపడుతున్నారు. 

Similar News