బీసీల చుట్టూ పార్టీలు ...బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న వైఎస్‌ జగన్‌

Update: 2019-02-17 05:37 GMT

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బీసీలపై ఫోకస్ పెట్టారు. అత్యధిక శాతమున్న బలహీనవర్గాలను తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహిస్తోన్న బీసీ గర్జనలో జగన్‌ డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు ఏమేం చేయబోతున్నామో జగన్ ప్రకటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా బీసీలపై ప్రేమ కురిపిస్తున్నాయి. బలహీనవర్గాల ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలోకి వేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే బీసీలపై వరాల జల్లు కురిపించగా, ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌తో బలహీనవర్గాలను తనవైపు తిప్పుకునేందుకు పావులు కుదుపుతున్నారు.

టీడీపీ జయహో బీసీ సభకు పోటీగా ఏలూరులో బీసీ గర్జన నిర్వహిస్తోన్న వైసీపీ అధికారంలోకి వస్తే చేయబోయే పనులతోపాటు బీసీలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత కల్పించనున్నట్లు ప్రకటించబోతోంది. అలాగే వివిధ సామాజికవర్గాల స్థితిగతులు, సమస్యలపై అధ్యయనం కమిటీ వేసి డిమాండ్లు సేకరించిన వైసీపీ అధినేత జగన్‌ వాటన్నింటినీ బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించనున్నారు. అలాగే వాటిని మేనిఫెస్టోలోనూ చేర్చనున్నారు.

బీసీలే టీడీపీ బలమని బాబు చెబుతుంటే ఆ బలాన్ని తమ వైపు తిప్పుకునేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారు. ఏలూరులో నిర్వహించనున్న బీసీ గర్జనతో ఆకట్టుకునేందుకు పావులు కుదుపుతున్నారు. మరి బీసీలు ఎవరి వైపు మొగ్గుచూపుతారో ఎవరికి హ్యాండిస్తారో మరో రెండు నెలల్లో తేలిపోనుంది. 

Similar News