నారావారి కంచుకోటకు జగన్‌

Update: 2019-04-05 05:24 GMT

ఎన్నికల ప్రచారంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మొన్న ప్రతిపక్ష నాయకుడి ఇలాఖాలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయగా ఇవాళ జగన్‌ కుప్పంలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న వైసీపీ అందుకు అనుగుణంగా కుప్పంలో కూడా ప్రభావం చూపించేందుకు సిద్ధమవుతోంది.

నారావారి కంచుకోట

చంద్రబాబు సొంత నియోజకవర్గం

30 యేళ్లుగా ప్రాతినిధ్యం

6 సార్లు ఎమ్మెల్యేగా విజయం

అలాంటి కుప్పంలో ప్రతిపక్ష నాయకుడు జగన్‌ అడుగుపెడుతున్నారు. నారావారి కోటపై వైసీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు.

ఈ ఉదయం కుప్పంలో జగన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మొన్నటికి మొన్నే చంద్రబాబు జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రచారంలో పాల్గొన్నారు. రెండు రోజులు కాకముందే జగన్‌ కుప్పం పర్యటన ఖరారు కావడంతో రాజకీయంగా సంచలనంగా మారింది.

కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన జగన్‌ చంద్రబాబును ఎదుర్కొనేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ తగ్గించినట్లు చెబుతున్న వైసీపీ నాయకులు ఈ సారి ఆయన విజయంపై కచ్చితమైన ప్రభావం చూపించాలని భావిస్తున్నారు.

మరోవైపు కుప్పంలో ఇప్పటికే చంద్రబాబు కుటుంబ సభ్యులు, అక్కడి టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో జగన్‌ కుప్పంకు ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న వైసీపీ కుప్పంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.  

Similar News