టీడీపీ, వైసీపీల్లోకి వలసలు మరి జనసేనలో లేవెందుకు?

Update: 2019-02-20 07:38 GMT

అనగనగా ఒక ఏరియాలో మూడు దుకాణాలు. రెండు అంగళ్లకు కొత్త కస్టమర్లు క్యూకడుతున్నారు. అందులో ఒక దుకాణానికైతే, వినియోగదారులు ఎగబడి వెళుతున్నారు. కానీ ఒక అంగడికి అసలు గిరాకీ లేదు. బడాబడా కస్టమర్లూ రావడం లేదు. ఎందుకు ఏమైంది ఆ షాప్‌కు ఈ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌ మీకర్థంకావాలంటే డైరెక్టర్‌ మ్యాటర్‌‌లోకి ఎంటర్ కావాల్సిందే.

ఎన్నికల టైంలో వలసలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ, వైసీపీలో జంపింగ్స్ అన్నీఇన్నీ కావు. ఇక వైసీపీ వైపు చూసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దగ్గుబాటి కుటుంబం మొదలు ఆమంచి, అవంతి, నేడు కిల్లీ కృపారాణి ఇలా ప్రతిరోజూ జగన్‌ను ఎవరో ఒకరు ముఖ్య నేతలు కలుస్తున్నారు. కండువాలు కప్పుకుంటున్నారు. కానీ ఎగసిపడుతున్నామంటున్న జనసేన వైపు మాత్రం, ఎవరూ చూడ్డంలేదు. అదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హట్‌ టాపిక్‌గా మారింది.

తెలుగుదేశంలో చాలామంది నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ మారడానికి ప్రత్యామ్నాయంగా కేవలం వైసీపీనే చూస్తున్నారు. తెలుగుదేశం తర్వాత సేఫ్‌ ల్యాండింగ్‌గా జగన్‌ పార్టీనే ఎంచుకుంటున్నారు. అటు వైసీపీలో ఇమడలేని చాలామంది నేతలకు, సహజంగా అధికార తెలుగుదేశమే ప్రత్యామ్నాయంగా కనపడుతోంది. ఈ రెండు పార్టీలకు ఆల్టర్నేటివ్‌ జనసేననే అని పవన్ చెప్పుకుంటున్నా, నేతలు మాత్రం అలా చూడ్డంలేదు. ఎందుకని.

ఇప్పటి వరకూ జనసేనలో చేరిన ప్రముఖులు కొందరే. అందులో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల సత్యనారాయణ, అలాగే మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు, బాలరాజులు మాత్రమే, జనసేలో చేరిన కొద్దిమంది కీ లీడర్స్. మెగా హీరో, అందులోనూ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అయిన జనసేన వైపు మాత్రం ఎవరూ రావడం లేదు. కొందరు మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మాత్రం చేరుతున్నారు. అయితే గెలుపు గుర్రాల్లాంటి నేతలు గాజు గ్లాసు వైపు చూడ్డంలేదు. చివరికి కాపు నేతలు సైతం పవన్‌తో చేతులు కలపకుండా, ఫ్యాన్‌ కిందికి చేరిపోతున్నారు. పార్టీలో చేరడం, చేర్పించుకోవడం అన్నది, ఎవరిష్టంవాళ్లదే. కానీ ఎన్నికల టైంలో దుమ్ముదులపాల్సిన జనసేన ఎందుకు ఆకర్షణీయంగా కనపడ్డంలేదన్నది ఎవరికీ అర్థంకావడం లేదు.

పవన్‌ కల్యాణ్‌తో చేతులు కలపకపోవడానికి చాలామంది నేతలు, చాలా కారణాలు చెబుతున్నారు. ఎన్నికలు ముంచకొస్తున్నా పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఒక రూపు రాలేదు. పవన్‌‌కు నిలకడలేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కింగ్‌ మేకర్‌ అవుతామని అంటున్నారు కానీ, కింగ్‌గా అవతరిస్తామని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోతున్నారు. అందుకే జనసేన వైపు చూడ్డానికి ఇతర పార్టీల నేతలకు ధైర్యంచాలడం లేదని విశ్లేషకుల అభిప్రాయం.

పవన్‌ కల్యాణ్‌ కూడా ఎవర్నీ పార్టీలోకి స్వయంగా పిలవడంలేదు. లేదంటే ఇతర పార్టీ నేతలను ముందుపెట్టి, ఆకర్షించే ప్రయత్నం చేయడంలేదు. దీంతో ఎటుపోవాలో అర్థంకాని కొందరు నేతలు, ఎందుకైనా మంచిదని టీడీపీలోకో, లేదంటే వైసీపీ వైపో వెళుతున్నారు తప్ప, జనసేన తలుపులు తట్టడంలేదు. ఇందుకు నిదర్శనం, అలీ కూడా చివరికి జనసేనలో చేరకపోవడం. పవన్‌-అలీ ఇద్దరూ మంచి మిత్రులని అందరికీ తెలుసు. కానీ ఇప్పటివరకూ తనను పవన్‌, పార్టీలోకి ఆహ్వానించలేదని, పార్టీలో చేరాలని పరోక్షంగానైనా సంకేతాలివ్వలేదని స్వయంగా అలీనే చాలాసార్లు చెప్పుకున్నారు.

అనుభవమున్న సీనియర్ నేతలు పిలవకపోవడానికి పవన్‌కు ఈగో అడ్డొస్తుందని కొందరంటే, కాన్ఫిడెంట్‌గా లేకపోవడం కూడా కారణమని మరికొందరంటున్నారు. పవన్‌ పార్టీ, మరో చిరంజీవి పార్టీలా మారుతుందన్న భయమూ కారణం కావచ్చంటున్నారు. అందుకే పార్టీ దూకాలని చూస్తున్న చాలామంది నేతలు, జనసేన వైపు మాత్రం జంప్‌ చేయడంలేదు. ఎన్నికల టైంలో ఒకవైపు వరుస చేరికలు, హామీలతో జగన్‌ జనంలోకి వెళుతున్నారు. మరోవైపు చంద్రబాబు సైతం ఆకర్షణీయ వాగ్దానాలతో జనంలోనే ఉంటున్నారు. కానీ ఇప్పటివరకూ జనసేన నుంచి ఒక్క హామీ కూడా బయటకు రాలేదు. అభ్యర్థులెవరో జనాలకు అసలు తెలియడం లేదు. చూడాలి, ఈ మౌనం మొత్తం వ్యూహాత్మకమా కేవలం తన పాపులారిటీతో కొత్తవారిని గెలిపించే దీమానా రానున్న రోజుల్లో, వీటికి సమాధానం వస్తుందేమో చూడాలి.

Full View

Similar News