యలమంచిలిలో అంతులేని భయం...ఎవరికి?

Update: 2019-04-26 07:36 GMT

విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పాగా వేసే నేత ఎవరు టీడీపీకి కంచుకోట భావించే యలమంచిలిలో, ఈసారి కూడా పసుపు జెండానేనా లేదంటే వైసీపీ పతాకం ఎగురుతుందా ఈ రెండూ వద్దని జనసేన జెండాను జనం ఆదరించారా రకరకాల సమీకరణలు, అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్టలతో ముడిపడిన యలమంచిలి విజేత ఎవరు? ఏ పార్టీ దీమా ఎలా ఉంది? అందుకు కారణాలేంటి?

విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో రాజకీయం చాలా ప్రత్యేకం. ప్రధానంగా టీడీపీకి అనుకూలమైన ప్రాంతం. 1,97,602 మంది ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గంలో, నాలుగు మండలాలు కలిసి వున్నాయి. మునగపాక, అచ్యూతాపురం, రాంబిల్లి, యలమంచిలి మండలాలు వున్నాయి. కాపు, యాదవ, వెలమ, గవర సామాజిక వర్గం ప్రజలు ఎక్కువుగా వున్నారు. పార్టీల బలం, అభ్యర్థుల వ్యక్తిగత చరిష్మాతో పాటు సామాజిక సమీకరణలు కూడా ఇక్కడ గెలుపోటములను శాసిస్తాయి. అందుకే ఎన్నికల ముందు క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌లో చక్రంతిప్పాయి పార్టీలు.

1989 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే, నాలుగు సార్లు టీడీపీ, రెండుసార్లు కాంగ్రెస్ విజయం సొంతం చేసుకుంది. పప్పల చలపతిరావు, కన్నబాబు మధ్య పోటీ జరిగినా, టీడీపీ నేత పప్పల చలపతిరావు ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ నుంచి కన్నబాబు, టీడీపీ నుంచి లాలాం భాస్కర్, పీఆర్పీ అభ్యర్థిగా గొంతిన నాగేశ్వరరావు పోటీ పడగా, కన్నబాబు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పంచకర్ల రమేష్ బాబు, వైసీపీ నుంచి ప్రగాడ నాగేశ్వరరావు, పోటీ పడగా, 8,375 ఓట్ల మెజారిటీతో పంచకర్ల రమేష్ బాబు గెలపొందారు.

ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి పంచకర్ల రమేష్ బాబు, వైసీపీ నుంచి కన్నబాబురాజు, జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్ కుమార్ పోటీలో నిలిచారు. అయితే అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వైరం, జనసేన నేత విజయ్ కుమార్‌కు కలసి వస్తుందని రాజకీయ అంచనాలున్నాయి. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల, టీడీపీ హవా కొనసాగుతుందని అంచనా వేస్తుంటే, వైసీపీ నేత కన్నబాబురాజు మాత్రం సీనియారిటీకి ప్రజలు పట్టం కట్టారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి యలమంచిలి ప్రజల మదిలో వున్న నాయకుడు ఎవరో ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.

Full View  

Similar News