ధర్మవరం సమరంలో ఓటర్లు ఎవరికి జై కొట్టారు?

Update: 2019-05-18 08:49 GMT

పట్టుచీరలకు ప్రపంచ గుర్తింపు పొందిన ధర్మవరంలో గెలుపెవరిది నేతన్నలు ఏ పార్టీని ఆదిరించారు మొన్నటి ఎన్నికల్లో ఎవరిని తమ నేతగా ఎన్నుకున్నారు ధర్మవరం ఎవరి పరం కానుంది మరోమారు ఎమ్మెల్యేగా గోనుగుంట్ల సూర్యనారాయణ విజయకేతనం ఎగరవేస్తారా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికే ధర్మవరం ఓటర్లు పట్టంకట్టారా కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ కావడంతో, ధర్మవరం ఫలితంపై అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి మరి ధర్మవరం ఎవరిది?

అనంతపురం జిల్లాలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఒక్కటైన ధర్మవరం నియోకజవర్గంలో, ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చేనేతలు ఎక్కువగా ఉండే ధర్మవరంలో ఈసారి ప్రజలు ఏ పార్టీని ఆదరించారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.

ధర్మవరం నియోకజవర్గంలో ధర్మవరం పట్టణంతో పాటు ధర్మవరం మండలం, బత్తులపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలు ఉన్నాయి. 2,40,323 మంది ఓటర్లు. అందులో పురుషులు 1,20,000 మంది, స్త్రీలు 120,305 మంది, ఇతరులు 18 మంది. ఎన్నికల్లో ఈసారి 86.5 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ధర్మవరం నియోకజవర్గంలో 84.02శాతం పోలింగయ్యింది. గత ఎన్నికల కంటే ఈసారి 2.48 శాతం ఎక్కువగా పోలింగ్ రికార్డయ్యింది.

టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరు నేతలు బలమైన వ్యక్తులు కావడంతో ఎన్నికల పోరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. పోలింగ్‌ సరళిపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గత ఎన్నికల్లోనూ ఈ ఇద్దరు నేతలే టీడీపీ, వైసీపీ నుంచి పోటీ పడ్డారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోనుగుంట్ల సూర్యనారాయణ 14,211 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తాజాగా మరోమారు ఇద్దరు నేతలు ఎన్నికల్లో తలపడ్డారు. ఈసారి గెలుపు ఎవరిదన్నది ఆసక్తిగా మారింది.

ఎమ్మెల్యేగా సూర్యనారాయణ ఐదేళ్లలో నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో తాగు, సాగు నీటి సరఫరాలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో చిత్తశుద్ధితో పనిచేశారని అంటున్నారు. ఈ అభివృద్ది పనులు చూసే, జనం పెద్ద ఎత్తున టీడీపీని ఆదరించారని, ఈసారి కూడా గోనుగుంట్ల సూర్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుస్తారని కాన్ఫిడెంట్‌ వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు.

మరోవైపు వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా, అదే ఉత్సాహంతో గెలుపు తనదేనంటున్నారు. 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గోనుగుంట్ల సూర్యనారాయణపై కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అయితే 2014లో సూర్యనారాయణ చేతిలో ఓడిపోయారు. ఈసారి ఫ్యాను ప్రభంజనం తప్పదని కేతిరెడ్డి అంటున్నారు. ధర్మవరంలో ఐదేళ్లుగా నెలకొన్న అవినీతి అక్రమాలతో ప్రజలు విసిగిపోయారని, ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ధర్మవరం పట్టణంలోని పలు వార్డుల్లో తమకు మెజార్టీ వస్తుందని ప్రచారం చేస్తున్నారు. ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లోనూ తమకే మెజార్టీ ఖాయమంటున్నారు. అటు ధర్మవరం పట్టణంలో మెజార్టీ సాధిస్తామని, మండలాల్లోనూ ఆధిక్యం వస్తుందన్న భరోసా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.

ముందు నుంచి రక్తచరిత్ర ఉన్న ధర్మవరంలో పోలింగయితే ప్రశాంతంగా సాగింది. అయితే ఈసారి పెద్ద ఎత్తున జనం ఓటింగ్‌లో పాల్గొనడం, ఉత్కంఠగా పోరు జరగడంతో ధర్మవరం జనం మదిని ఎవరు గెలిచారన్నది అంతుపట్టడం లేదు. 

Similar News