ఎలక్షన్ కోడ్ అంటే ఏమిటి...ఎలక్షన్ కోడ్‌లో ఉన్న నిబంధనలేంటి..?

Update: 2019-03-11 08:35 GMT

ఎన్నికల ప్రకటన వెలువడటంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేస్తోంది. అసలు ఎలక్షన్ కోడ్ అంటే ఏమిటి..? ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏం చెబుతోంది..?

ఎలక్షన్ షెడ్యూల్ వెలువడటంతోనే ఎన్నికల ప్రవర్తన నియమావళి కూడా అమల్లోకి వచ్చింది. ప్రచారం నుంచి పోలింగ్‌ వరకు జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈసీ ఎన్నికల నియమావళిని అమల్లోకి తెచ్చింది. ఎన్నికల నిర్వహణలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు రూపొందించారు. రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న వారు ఏమేం చేయకూడదో ఎలక్షన్ కోడ్ తెలియజేస్తుంది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రధానంగా ఎనిమిది అంశాలతో ముడిపడి ఉంటుంది. వాటిల్లో పార్టీలు, నేతలు, అభ్యర్థులు చేసే ప్రసంగాలు, సభలు-సమావేశాలు, ఊరేగింపులు-ర్యాలీలు, పోలింగ్‌ రోజున ఆంక్షలు, పోలింగ్‌ బూతుల్లో ఆంక్షలు, పర్యవేక్షకుల నియామకం, అధికారంలో ఉన్న పార్టీకి నిబంధనలు, ఎన్నికల మేనిఫెస్టోలపై నిఘా ఉంటాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రచారంలో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు. అధికార పార్టీలు కొత్త పథకాలను, ప్రాజెక్టులను, విధానాలను ప్రకటించకూడదు. ప్రభుత్వ ఖర్చులతో మీడియా, ఇతర మాధ్యమాల్లో ఇచ్చే ప్రకటనలపై నిషేధం ఉంటుంది.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మంత్రులు, నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారు అధికారిక కార్యక్రమాల పేరుతో ప్రచారం చేయకూడదు. ప్రభుత్వ వాహనాలను వినియోగించకూడదు. బహిరంగ సభల నిర్వహణకు స్థలాలు, హెలిప్యాడ్‌ల వినియోగంలోనూ అధికార పార్టీతో పాటు అనుమతుల విషయంలో అన్ని పార్టీలకు ఒకే నిబంధన వర్తిస్తుంది. ప్రభుత్వాలు ఎలాంటి తాత్కాలిక నియామకాలు చేపట్టకూడదు. ఎన్నికల ప్రచారానికి వేదికలుగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనామందిరాలను ఉపయోగించకూడదు. ఎలక్షన్స్ కి 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారాలు చేయకూడదు.

మన దేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి మొదటిసారిగా 1960లో కేరళ శాసనసభ ఎన్నికల్లో అమలైంది. ఆ తర్వాత 1962 నుంచి లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. 1979 అక్టోబరులో అధికార పార్టీలను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకువస్తూ భారత ఎన్నికల సంఘం మార్పులు చేసింది. రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాల మేరకు ఎన్నికల సంఘం ఈ నియమావళిని అమలు చేస్తోంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్టు ఎవరైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు.

Similar News