టీడీపీ కంచుకోట...బోణీ కొట్టేందుకు వైసీపీ వ్యూహం

Update: 2019-04-06 11:37 GMT

టీడీపీ విజయాల కోట, పసుపు అడ్డా పశ్చిమగోదావరి జిల్లాలో పాగా వేయటానికి జగన్ నేతృత్వంలోని వైసీపీ, జనసేనాని పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలు ఎదురుచూస్తున్నాయి. రాజకీయ చైతన్యానికి మరోపేరైన పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ, రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలలో వివిధ పార్టీల అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

సినిమాలు, కోడిపందేలు సరదాలకు మరోపేరు పశ్చిమగోదావరి జిల్లా. రాజకీయ నాయకులనైనా సినీ హీరోలనైనా, లేదా ఏదైనా ఓ పార్టీని ఒక్కసారి ఇష్టపడితే అభిమానంతో తడిసి ముద్ద చేయటం పశ్చిమగోదావరి జిల్లా వాసులకు పుట్టకతోనే వచ్చిన సుగుణం.

గత ఎన్నికల్లో జిల్లాలోని 15 కు 15 స్థానాలూ నెగ్గిన రికార్డు టీడీపీ-బీజేపీ పక్షానికి ఉంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలవడం, జనసేన, వైసీపీ పార్టీలు ప్రధానప్రత్యర్థులుగా రంగంలో నిలవడంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పవన్‌ కల్యాణ్‌ భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సై అంటుంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం పశ్చిమగోదావరి జిల్లాలో బోణీ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల స్థానాలలో గట్టిపోటీనే జరుగనుంది. ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాల్లో బహుముఖ పోటీ అనివార్యంగా మారింది.

నరసాపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తొలిసారిగా పోటీకి దిగడంతో ఎక్కడలేని ఆసక్తి నెలకొని ఉంది. అధికార టీడీపీ నుంచి ఎమ్మెల్యే శివరామరాజు ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. వైసీపీ నుంచి కనుమూరి రఘు రామకృష్ణంరాజు బరిలో ఉండగా వీరితో పాటు ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కనుమూరి బాపిరాజు. మూడోసారి బరిలోకి దిగారు దీంతో బహుముఖ పోటీ అనివార్యమయ్యింది.

ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ మాగంటి బాబు మరోసారి టీడీపీ పక్షాన పోటీకి దిగుతున్నారు. ఆయనతో వైసీపీ తరఫున మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు శ్రీధర్‌, పోటీ పడుతున్నారు. జనసేన నుంచి ఆర్థిక విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు బరిలో ఉన్నారు. ఏలూరు పోటీ త్రిముఖ సమరంగానే ముగియనుంది. కాపు, ఎస్సీ, ఆర్యవైశ్య ఓటర్లు అత్యధికంగా ఉన్న ఈ జిల్లా ప్రస్తుత ఎన్నికల అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్యనే పోటీ ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. తొలిసారి బరిలోకి దిగుతున్న జనసేన కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలోని మొత్తం 15 నియోజకవర్గాల్లోని తణుకు, పాలకొల్లు, ఉండి, దెందులూరు, చింతలపూడి, గోపాలపురం, ఆచంట, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, ఉంగుటూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ భీకరంగా జరిగే అవకాశం ఉంది.

భీమవరం స్థానం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీలో నిలవడంతో సరికొత్త రాజకీయసమీకరణాలకు తెరలేచే అవకాశం కనిపిస్తోంది. రిజర్వుడు స్ధానాలైన పోలవరం, గోపాలపురం, చింతలపూడి, కొవ్వూరు నియోజకవర్గాల్లోనూ పోటీ తీవ్రంగా మారింది. పవన్‌ పోటీ దరిమిలా జనసేన అభ్యర్థులంతా జిల్లా అంతట గెలుపుపై ఆశలు పెంచుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మరెక్కడా లేనంతగా కులసమరం ఇక్కడే కనిపిస్తోంది. జిల్లాలో సామాజిక వర్గాల వారీగా ఓటర్లు తమ మనోభావాలను ప్రదర్శిస్తుండగా, తటస్థులు మాత్రం గెలుపోటములను నిర్ధారిస్తారు. కాపు సామాజిక వర్గం ప్రధాన భూమిక పోషిస్తుండగా, బీసీలు, ఎస్సీలది తదుపరి స్ధానం. శెట్టిబలిజ, గౌడ, వైశ్యులు, క్షత్రియులు, రెడ్డి, కమ్మ, వెలమ, యాదవ ఓటర్లు కొన్ని నియోజకవర్గాల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

ఇటీవలే సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్లు 32 లక్షల,18 వేల 407 మంది ఓటర్లున్నారు. వీరిలో 15 లక్షల 81వేల 496 మంది పురుష ఓటర్లు కాగా 16 లక్షల, 36 వేల ,610 మంది మహిళా ఓటర్లు, 301మంది మాత్రమే థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం.

సామాజికవర్గాల వారీగా ఓటర్లను చూస్తే 6 లక్షల 46 వేల,400 మంది కాపులు, 6 లక్షల 43 వేలమంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు. కమ్మ సామాజికవర్గం ఓట్లు: 1,88,745, బీసీలు: 7 లక్షల ,72 వేల,324 మంది, ముస్లిం ఓటర్లు 58 వేల 900 మంది, ఆర్యవైశ్య ఓటర్లు లక్షా 12 వేలం 200, బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటర్లు 42 వేల మంది ఉన్నారు. అంతేకాదు జిల్లాలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గంగా చింతలపూడి రికార్డుల్లో చేరింది. ఈ నియోజకవర్గంలో 2 లక్షల 63 వేల 337 మంది ఓటర్లున్నారు.

అతి తక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గంగా ...: నరసాపురం గుర్తింపు తెచ్చుకొంది. నరసాపురం నియోజకవర్గంలో మొత్తం లక్షా 68వేల122 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఎన్నో ప్రత్యేకతలున్న పశ్చిమగోదావరి జిల్లా ఓటర్లు ఇచ్చే తీర్పే అంతమంగా అధికారాన్ని నిర్ణయించడంలో నిర్ణయాత్మకం కానుంది.

Similar News