ఉద్రిక్తంగా మారిన అమిత్ షా ర్యాలీ

Update: 2019-05-14 15:17 GMT

బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కోల్‌కతాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. రోడ్ షో దారి మధ్యలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు.

అమిత్ షా రోడ్ షో యూనిర్సిటీ ఆఫ్ కొల్ కతా వద్దకు రాగానే ఒక్కసారిగా గొడవ మొదలైంది. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు విసురుకున్నారు. యూనివర్సిటీ ఎదుట నిలబెట్టిన వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.

కోల్‌కతాలోని విద్యాసాగర్ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు విద్యార్థులు అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లు విసరడంతో బీజేపీ కార్యకర్తలు కాలేజీపై దాడిచేశారు. కాలేజీ క్యాంపస్‌లోకి ఇటుకలు విసిరారు. కాలేజీ సమీపంలో ఉన్న ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.ఈ ఘటనతో కోల్‌కతా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలను చెదరగొట్టి నగరంలో భారీగా బలగాలను మోహరించారు.

పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి లభిస్తున్న ఆదరణ ఓర్వలేక టీఎంసీ దాడులకు పాల్పడుతోందని అమిత్ షా ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ దాడులు చేయిస్తోందని విమర్శించారు. 

Similar News