బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజు ఉగాది

Update: 2019-04-06 05:37 GMT

వసంత రుతువు ఆగమనానికి సంకేతం. నవ వసంతానికి నాందీవచనం. చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేసే శుభదినం. కోయిలలు కుహు కుహు రాగాలు పాడుతూ హాయిగొలిపే సుదినం. అదే ఉగాది. సృష్టికి ఆది. కాలచక్రంగా, ఒక ఆవృతం పూర్తిచేసి మళ్లీ మొదలయ్యే రోజే ఉగాది. ఇది కాలానికి సంబంధించిన పండుగ. సర్వ మానవాళికి కన్నులపండగ.

ప్రకృతి కన్నె పచ్చ చీర సింగారించుకొని నవ వసంతాన్ని కానుకగా తెచ్చే పండుగ యుగాది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజు చైత్ర శుధ్ధ పాఢ్యమి కావడంతో ఏటా ఆ పర్వదినాన మనం ఉగాది పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చిరు మామిళ్ల వగరు, వేప పువ్వుల చేదు, కొత్త బెల్లం తీపి, చింతపండు పులువు, మిరపకాయల ఘాటు, ఉప్పు ఇలాంటి షడ్రుచుల సంగమమే ఉగాది పచ్చడి.

ఉగాది పచ్చడిలాగే మన జీవితమూ షడ్రుచుల సమ్మేళనమే. కాసిన్ని ఆనందాలు, మరికాసిన్ని బాధలు, ఇంకొన్ని సంతోషాలు, అప్పుడప్పుడూ నిరాశానిస్పృహలు. వీటన్నింటి కలయికే జీవితమనే సారాన్ని ఉగాది పచ్చడి మనకందిస్తుంది. ఈ ఉగాది పర్వదినాన ఏ పనులు ప్రారంభించినా అవి నిర్విఘ్నంగా జరిగిపోతాయని పెద్దలు చెపుతూ ఉంటారు. అందుకే ఉగాది నాడు ఉదయమే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి భక్తితో పూజలు చేసి పంచాంగ శ్రవణం వింటారు.

కోకిలమ్మలు గొంతులు సవరించుకునే వేళ చిరుమామిళ్లు పరిపక్వతను సంతరించుకొనే సమయాన నవ వసంతం ఆనంద నర్తనం చేస్తూ జగతికి కొత్త ఆశలను మోసుకొచ్చే పండుగే ఉగాది. ఈ నూతన సంవత్సర కాంతుల్లో మోడువారిన జీవితాలెన్నో చిగురించాలని పాత గాయాలను మాన్పే లేపనంగా విళంబ నామ సంవత్సరం సర్వ మానవాళిపై కరుణ కురిపించాలని కోరుకుంటోంది హెచ్‌ఎంటీవీ. ఈ యుగాది నవ్యోదయాన కోటిఆశలతో సకల జగత్తు నవలోకంలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విళంబ నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెబుతోంది హెచ్‌ఎంటీవీ. 

Similar News