కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ..

Update: 2019-06-09 05:43 GMT

నైరుతి రుతు పవనాలు శనివారం కేరళను తాకినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. సుమారు వారం రోజులు ఆలస్యంగా ఇవి ప్రవేశించినట్టు వెల్లడించింది. వీటి ప్రభావంతో గత మూడు రోజులుగా లక్షద్వీప్‌, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బలమైన గాలులు వీస్తున్నాయి. శనివారం నాటికి ఈ ప్రాంతాలతో పాటు దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయని అధికారులు వివరించారు. వచ్చే 48 గంటల్లో కేరళ, తమిళనాడుతో పాటు నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య అరేబియా సముద్రం, పశ్చిమ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో అవి విస్తరించేందుకు అనువైన వాతావరణం కనిపిస్తోందని చెప్పారు.

రేపటిలోగా అల్పపీడనం

ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న లక్షద్వీప్‌ మీదుగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఆ తర్వాత ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని తెలిపారు. వచ్చే రెండ్రోజులు దక్షిణకోస్తాలో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. కొన్నిచోట్ల పిడుగులు పడతాయని చెప్పారు. 

Tags:    

Similar News