మరి కాసేపట్లో రెండో విడత పరిషత్‌ పోలింగ్‌ ప్రారంభం

Update: 2019-05-10 00:54 GMT

తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్‌ మరో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరగుతూ ఉండటంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. తొలి దశలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటర్లు తికమక పడకుండా MPTC, ZPTCల బ్యాలెట్ పేపర్లపై అవగాహన కల్పించారు.

తెలంగాణలోని హైదరాబాద్‌, మేడ్చల్ మినహా మిగిలిన 31 జిల్లాల పరిధిలోని 1850 ఎంపీటీసీ, 179 జెడ్పీటీసీ స్థానాలకు మరో గంటలో పోలింగ్ ప్రారంభం కానుంది. వాస్తవానికి 1913 MPTC స్ధానాల్లో , 180 ZPTC స్ధానాల్లో ఎన్నికలు జరగాల్సిన ఉంది. అయితే 63 MPTC స్ధానాలతో పాటు ఓ ZPTC ఏకగ్రీవం కావడంతో మిగిలిన స్ధానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.1850 ఎంపీటీసీల కోసం 6146 మంది బరిలో నిలిచారు.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామాగ్రి చేరి పోవడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలింగ్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఓటర్లు తికమక పడకుండా MPTC పోలింగ్‌కు పింక్ కలర్‌,ZPTC పోలింగ్‌కు వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ వాడనున్నారు. ఈసారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలుకు సిరా చుక్క పెట్టనున్నారు. అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్న పోలింగ్ బూత్‌‌లలో ఈ సారి ప్రత్యేక బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండలు అధికంగా ఉండటంతో అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర షామియానాలు వేయడంతో పాటు తాగు నీటి సౌకర్యం కల్పించారు.  

Similar News