బాధ్యతలు స్వీకరించబోతున్న సర్పంచ్‌లు

Update: 2019-02-02 05:14 GMT

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఇవాళ కొలువుదీరబోతున్నారు. వార్డు సభ్యుల కూడా ఇవాళ పదవీ ప్రమాణం చేయిస్తారు. సర్పంచులు బాధ్యతలు చేపట్టనుండడంతో 184 రోజుల పాటు సాగిన ప్రత్యేకాధికారుల పాలనకు ఇవాళ తెరపడబోతోంది.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగియడంతో ఇవాళ సర్పంచులు, వార్డు మెంబర్లు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. సర్పంచ్‌ల చేత గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవీ ప్రమాణం చేయిస్తారు. వార్డు సభ్యుల చేత కొత్త సర్పంచ్ పదవీ ప్రమాణం చేయిస్తారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పదవీకాలం ప్రమాణ స్వీకారం చేసినప్పటి ఐదేళ్ల పాటు ఉంటుంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది కొత్తవారే సర్పంచ్‌లుగా ఎన్నిక కావడంతో విధులు, అధికారాలు, బాధ్యతలు గురించి ఈనెల 11 నుంచి మార్చి 1 వరకు జిల్లాల వారీగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తొలివిడత శిక్షణ ఈనెల 11 నుంచి 15 వరకు, రెండో విడత 18 నుంచి 22 వరకు, మూడో విడత ఫిబ్రవరి 25 నుంచి మార్చి1 వరకు ఉంటుంది కొత్త సర్పంచులందరికీ ఈ శిక్షణాకార్యక్రమాల్లో పంచాయతీ రాజ్‌ చట్టంపై అవగాహన కల్పిస్తారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత పంచాయతీ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. 2018 జూలైలోనే ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉండగా పరిపాలన, చట్టపరమైన కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ఎన్నికలు ఐదు నెలల ఆలస్యంగా జరిగాయి. సర్పంచుల పదవీకాలం జులైలో ముగియడంతో గ్రామాలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వచ్చాయి. గతేడాది ఆగస్టు 2 నుంచి 184 రోజుల పాటు ప్రత్యేకాధికారులు పంచాయతీల పాలన చేశారు. ఇవాల్టి నుంచి పంచాయతీల పగ్గాలు ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వస్తాయి.

Similar News