అరకులో ఆ ఒక్కరెవరు?

Update: 2019-03-08 06:22 GMT

అమాయక గిరిజనం వుండే అందాల అరకు లోయ పార్లమెంట్ స్థానంలో పాగా వేసేది ఎవరు వైసీపీకి కంచుకోటగా వున్న ఏజేన్సీలో జెండా ఎగురవేసేది ఏ పార్టీ వలస నేతలతో అట్టుడుకుతున్న అరకులో, పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. కిషోర్ చంద్రదేవ్ చూపు టీడీపీ వైపు మరలడంతో అరకు ప్రాంతంలో రాజకీయ సమకీరణాలు మారుతున్నాయి.

విశాఖపట్నం జిల్లాలో వున్న మూడు పార్లమెంట్ స్థానాల్లో, అరకు పార్లమెంట్ స్థానానికి చాలా ప్రత్యేకత వుంది. ఈ నియోజకవర్గానికి ఏజెన్సీ ప్రాంతాలు ప్రధానంగా వుండటంతో పాటు ఉత్తరాంధ్రా మూడు జిల్లాలతో పాటు గోదావరి సరిహద్దు మండలాలు కూడా కలుస్తున్నాయి. దీంతో ఇక్కడ పోటీ చాలా ప్రత్యేకతలను సంతరించుకుంది.

అయితే 2014లో అరకు నుంచి పార్లమెంట్ స్థానంకు కొత్తపల్లి గీత వైసీపీ నుంచి గెలుపొందారు. తదుపరి పరిణామాలతో ఆమె పార్టీకి దూరం కావడంతో పాటు ప్రజలకూ దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సీటు హాట్ స్పాట్‌గా మారింది.

అయితే ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, టీడిపి తీర్ధం పుచ్చుకున్న సీనియర్ రాజకీయవేత్త, మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, అరకు పార్లమెంట్ స్థానం ఆశిస్తున్నారని తెలుస్తోంది. దీంతో వైసీపీకి పట్టున్న ఏజేన్సీలో టీడీపీ నుంచి అరకు ఎంపీ అభ్యర్ధిగా కిషోర్ చంద్రదేవ్ బరిలోనికి దిగితే ఫలాతాలు ఎలా వుండబోతాయన్న చర్చ ఆశక్తిగా మారింది.

సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పనిచేసి, పలుమార్లు ఎంపీ, కేంద్రమంత్రి పదవులు చేపట్టిన విజయనగరం జిల్లా కురుపాం సంస్థానదీశుడు వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్‌కు, ఉత్తరాంద్రా జిల్లాలో పట్టుంది. అదే క్రమంలో ప్రజలకు దూరంగా వుండే నేతగా కూడా పేరుంది. ఢిల్లికి మాత్రమే పరిమితం అయిపోతారని, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోరనే ఆరోపణలున్నాయి.

ఇక టీడీపీని చూస్తే ఏజెన్సీలో బలహీనంగా వుంది. 2014 ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానంను వైసీపీ గెలుచుకుంది. దీంతో ఇక్కడ ఎంపీ స్థాయిలో టీడీపీకి నేరుగా నాయకత్వం లేదు. అయినా వైసీపీకి ఇప్పటివరకు ఎంపీ అభ్యర్ధి ఖరారు కాలేదు. దీంతో అరకు ఎంపీ స్థానం సందిగ్ధంలో వుంది. ఒకవేళ టీడీపీ నుంచి కిషోర్ చంద్రదేవ్‌కు సీటిస్తే, సాలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే రాజన్న దొరను రంగంలోనికి దింపే అవకాశముంది.

మరోవైపు జనసేన, లెఫ్ట్ పార్టీల కలయికతో అరకు ఎంపీ స్థానంకు సీపీఎం అభ్యర్ధిగా కిల్లో సురేంద్ర పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు టీడీపీ నుండి కూడా కిషోర్ చంద్రదేవ్‌తో పాటు వైసీపీ నుంచి కుంభారవితో మరికొంతమంది ఆశావహుల పేర్లు వినిపిస్తున్నాయి. మోత్తానికి రాజావారి రాక, ఏజెన్సీలో రాజకీయంను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.

Full View 

Similar News