టీ కాంగ్‌లో పదవుల వేట

టీ కాంగ్రెస్ సీనియర్లను ఊరించిన ప్రతిపక్ష నేత పదవి భట్టి విక్రమార్కను వరించడంతో వారంతా ఇతర పదవులపై కన్నేశారు. పీఏసీ చైర్మన్ , సీఎల్పీ ఉపనేత, సీఎల్పీ విప్ పదవుల కోసం పైరవీలు చేస్తున్నారు.

Update: 2019-01-26 05:24 GMT

టీ కాంగ్రెస్ సీనియర్లను ఊరించిన ప్రతిపక్ష నేత పదవి భట్టి విక్రమార్కను వరించడంతో వారంతా ఇతర పదవులపై కన్నేశారు. పీఏసీ చైర్మన్ , సీఎల్పీ ఉపనేత, సీఎల్పీ విప్ పదవుల కోసం పైరవీలు చేస్తున్నారు. ఓటాన్ అకౌంట్ సమావేశాల్లోపు ఈ పదవులను భర్తీ చేసే అవకాశం ఉండడంతో ఎవరి ప్రయత్నాల్లో వారు ముగినిపోయారు.

సీఎల్పీ పీఠాన్ని అధిష్టానం భట్టి విక్రమార్కకు కట్టపెట్టిడంతో ఆ పదవి ఆశించిన వారు కొంత అసంతృప్తికి లోనైనా రాహుల్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. దీంతో మిగతా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎల్పీ పదవి తర్వాత అసెంబ్లీకి సంబంధించి పీఏసీ ఛైర్మన్ , సీఎల్పీ ఉప నేతలు , విప్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పదవుల కోసం సీనియర్ ఎమ్మెల్యేలంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

పీఏసీ పదవి రేస్‌లో మాజీ మంత్రులు శ్రీధర్ బాబు ,సబితా ఇంద్రా రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ ముగ్గురూ గతంలో మంత్రులుగా పని చేసినవారే. పైగా నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే శ్రీధర్ బాబు ,సబితా ఇంద్రా రెడ్డి కంటే వనమాకే ఎక్కువ సీనియారిటీ ఉంది. గతంలో కూడా అందరి కంటే సీనియర్‌కే పీఏసీ పదవి ఇచ్చారు. కాబట్టి ఈసారి కూడా సీనియారిటీకే ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. కానీ సామాజిక కోణంలో చూస్తే పీసీసీ చీఫ్‌ పదవి రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉండడం, సీఎల్పీ పదవిని దళిత సామాజికవర్గానికి ఇవ్వడంతో బీసీకి పీఏసీ పదవి ఇస్తారనే వాదన ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న ఒకే ఒక్క బీసీ ఎమ్మెల్యే వనమానే కావడంతో ఆయనకే పీఏసీ పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సీనియారిటీ పరంగా చూసినా కుల ప్రాతిపదికన చూసినా వనమాకే పీఏసీ పదవి దక్కుతుందని అంటున్నారు. మరి సీనియార్టీతో పాటు కులం లెక్కల ప్రకారం పీఏసీ పదవి ఇస్తారా లేదంటే లాబీయింగ్ చేసిన వారికి అప్పచెబుతారా అనే సస్పెన్స్ నెలకొంది.

పీఏసీ పదవితో పాటు డిప్యూటీ సిఎల్పీగా కూడా ఇద్దరిని నియమించుకునే అవకాశం ఉంది. ఈ పదవులు కూడా సీనియారిటీ ప్రాతిపదికనే ఇస్తారు. గతంలో జీవన్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎల్పీ ఉప నేతలుగా ఉన్నారు. ఇక సీఎల్పీ సెక్రెటరీ , సీఎల్పీ విప్ పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు పదవులు గతంలో మొదటి సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన రామ్మోహన్ రెడ్డి, సంపత్ కుమార్‌కి ఇచ్చారు. అయితే ఈసారి విప్ పదవి జగ్గారెడ్డిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ హైకమాండ్ అసెంబ్లీ పదవుల భర్తీ ఏ ప్రాతిపదికన కట్టపెడుతుందో చూడాలి. 

Similar News