దాడులపై 10రోజుల ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

Update: 2019-04-22 03:10 GMT

ఇటీవల కాలంలో ప్రపంచంలో ఏదేశంలోనూ కనీవినీ ఎరుగని జరగని మారణహోమది. ఆదివారం అందునా ఈస్టర్‌. క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారు. క్రీస్తు పునర్జన్మించిన క్షణాలను తలుచుకుని పులకరించిపోతున్నారు. అదే సమయంలో ముష్కరులు పంజా విసిరారు. మానవబాంబులుగా మారి అమాయక ప్రాణాలు తీశారు. విదేశీయులే లక్ష్యంగా సాగిన మృత్యుక్రీడ ఆదేశ చరిత్రలో మరో విషాద ఘటనగా మిగిలిపోయింది.

అయితే ఇంత భారీ మారణహోమం వెనుక ఉన్నదెవరు..? బాంబు పేలుళ్లు వెనుక ప్లాన్‌ ఏంటి..? ఈ ఘటన కోసం పన్నిన వ్యూహం ఏంటి..? ఒక్కరోజులోనే స్కెచ్‌ వేసి అమలు చేయడం సాధ్యమవుతుందా..? ఏకంగా 9 చోట్ల బాంబులు పేల్చారంటే ఎంత పకడ్బందీగా ప్లాన్‌ అమలై ఉంటుంది..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చేందుకు భద్రతావ్యవస్థలు విచారణను ముమ్మరం చేస్తున్నాయి.

ఏదేమైనా ఇంత పెద్ద దాడుల వెనుక.. భారీ కసరత్తే ఉండి ఉంటుంది. రోజుల తరబడి వ్యూహం పన్నే ఉంటారు. తమ ప్రణాళికలను అమలు చేసేందుకు పలుమార్లు

రెక్కీ కూడా నిర్వహించే ఉంటారు. అయితే కొన్ని రోజుల ముందు నుంచే దాడులపై ముష్కరులు ప్లాన్లు వేస్తుంటే ఆ దేశ భద్రతా వ్యవస్థ ఏం చేస్తుందనే దానిపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పూర్తిగా భద్రతా వ్యవస్థ వైఫల్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ నెల 11 నే దేశవ్యాప్తంగా దాడులు జరుగుతాయంటూ ఇంటలీజెన్స్‌ రిపోర్ట్‌ ఇచ్చింది. కానీ ఆ రిపోర్ట్‌ను భద్రతా వ్యవస్థలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకు పర్యవసానంగా ఇంత భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ పేలుళ్లు జరిగినా ఉగ్రదాడులు చోటు చేసుకున్నా బలయ్యేది మాత్రం ఎప్పట్లాగే అమాయక జనమే.  

Similar News