దేశ రాజకీయాల్లో ఆయనో సంచలనం..

Update: 2019-06-01 06:31 GMT

బక్కపల్చని శరీరం వంటిపై కుర్తా పైజామా భుజానికి ఓ బ్యాగు పూరింట్లో నివాసం నిరాడంబర జీవితం ఎంతదూరమైనా సైకిల్‌పైనే ప్రయాణం ఆయన్ను చూసిన వాళ్లెవరు ఓ ప్రజా ప్రతినిధి అంటే నమ్మరు. 10ఏళ్లపాటు ఎమ్మెల్యేగా విధులు నిర్వహించినా ఖరీదైన కార్లు, పక్కా ఇళ్లు లేదు తకు వచ్చే జీతం ఇతర నిధులు కూడా ప్రజా ప్రయోగానికే వినియోగిస్తూ. ప్రజలతో మమేకమై వారి కష్టాల్లో పాలుపంచుకుంటూ ఒడిశా మోడీగా పేరుతెచ్చుకున్న సారంగిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

ఆయనే ప్రతాప్ చంద్ర సారంగి. ఒడిశా మోడీగా ఫేమస్ అయిన సారంగి తొలిసారి ఎంపీగా ఎన్నికవడమే కాదు.. కేంద్ర కేబినెట్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఒడిశా మోడీగా ఇటీవల మీడియాతో పాటు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సారంగి బాలాసోర్ నుంచి విజయం సాధించారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఇప్పుడు కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ప్రమాణస్వీకారానికి వస్తుండగా పలువురు ప్రముఖులు, కార్యక్రమానికి హాజరైన అతిధులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇది చాలు ఆయన గొప్పతనమేంటో అర్థం అవుతుంది.

నిరాడంబర జీవితం, సైద్దాంతిక నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రధాని మోడీ దృష్టిని సారంగి ఆకర్షించారు. ఆకారణంగానే ఆయన కేంద్ర సహాయమంత్రి బెర్త్ దక్కింది. బాలాసోర్ నుంచి ఎన్నికైన తర్వాత కూడా పూరి గుడిసె ఆయన నివాసం ఉన్నారు. సైకిల్‌పైనే సవారీ చేస్తూ భుజాన సంచీ వేసుకుని, కుర్తా పైజామాలో సాదాసీదాగా కనిపిస్తారు. ఆ నిరాడంబరతే ఇప్పుడు ఆయనను కేంద్రమంత్రివర్గంలో సహాయ మంత్రిని చేసింది.

64ఏళ్ల వయసున్న ప్రతాప్ చంద్ర సారంగికి ఎంతోకాలంగా బీజేపీతో అనుబంధం ఉంది. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ కార్యకర్త అయిన ఆయన.. 2004, 2009 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో నీలగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పదవిలో ఉన్నప్పుడు తనకు అందే జీత భత్యాల, ఆ తర్వాత వస్తున్న పెన్షన్‌ను గిరిజన ప్రాంతాల్లో పేద విద్యార్థుల చదువులకు ఖర్చు చేస్తున్నారు. 2014లో బాలాసోర్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలైన ఆయన ఈసారి ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థి రవీంద్ర కుమార్‌పై 12వేల956 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఓక చిన్న పదవి వస్తే చాలు అందిన మేర దోచేస్తున్న నేతలున్న ఈరోజుల్లో ప్రతాప్ చంద్ర సారంగి లాంటి నేతలు అందరికీ ఆదర్శప్రాయం.

Full View

Similar News