తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు

తెలుగు లోగిళ్లు సంక్రాంతి శోభ కళకళలాడుతున్నాయి. పట్నం నుంచి పల్లె వరకు ప్రతి ఇంటి ముంగిట రంగు రంగుల ముగ్గులు హరివిల్లులను తలపిస్తూ సంక్రాంతి వైభవంతో కళకళలాడుతున్నాయి.

Update: 2019-01-15 04:20 GMT
sankranthi festival

తెలుగు లోగిళ్లు సంక్రాంతి శోభ కళకళలాడుతున్నాయి. పట్నం నుంచి పల్లె వరకు ప్రతి ఇంటి ముంగిట రంగు రంగుల ముగ్గులు హరివిల్లులను తలపిస్తూ సంక్రాంతి వైభవంతో కళకళలాడుతున్నాయి. బంధుమిత్రులు, కొత్త కోడళ్లు, అల్లుళ్ల రాకతో పల్లెలు కోలాహలంగా మారాయి. నిన్నంతా భోగి భాగ్యాలతో సంబరాలు జరుపుకున్న తెలుగు ప్రజలు ఈ రోజు సంక్రాంతికి వెల్ కమ్ చెబుతూ తెల్లవారుజాము నుంచే సందడి చేస్తున్నారు.

పట్టణాల నుంచి పల్లెలకు తరలివచ్చిన చిన్నా, పెద్దలతో గ్రామాలు సందడిగా మారాయి. పండగను కీర్తిస్తూ హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు.., వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలూ అక్కడక్కడా పిట్టలదొరల బడాయి మాటలతో తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు కొత్త శోభను సంతరించుకున్నాయి.

మూడు రోజుల సంక్రాంతిలో రెండో సంక్రాంతిగా జరుపుకుంటారు. పుష్యమాసంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పుణ్యదినాన్ని తెలుగు ప్రజలు సంక్రాంతిగా జరుపుకొంటారు. 'సం' అంటే మిక్కిలి 'క్రాంతి' అంటే అభ్యుదయం అని అర్థం. మంచి అభ్యుదయాన్నే ఇచ్చే క్రాంతి కాబట్టి దీన్ని 'సంక్రాంతి'గా భావిస్తూ యావత్ కుటుంబ సభ్యులు ఒకే చోటుకు చేరి ఈ పండగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ పండగ కోసమే విదేశాల్లో ఉన్న వారు సైతం స్వగ్రామాలకు వస్తూ ఉంటారు. మూడు రోజుల పాటు గ్రామాల్లోనే ఉండి పిల్ల,పాపలతో కలిసి పోయి సంబరాలు జరుపుకుంటారు . ఆకాశమంత ఆనందం.. భూమండలమంత సంతోషం జతకలిస్తే సంక్రాంతి అవుతుందనే నానుడి ఈ సంబరాలను బట్టే వచ్చింది.

నిన్నంతా ఇళ్ల ముంగిట భోగి మంటలు వేసుకుంటూ ఆటపాటలతో గడిపిన వారంతా కొత్తగా వచ్చిన పంటలతో వంటకాలు తయారు చేసుకుని పండగను ఆస్వాదింస్తారు. అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సాయంకాలం కుటుంబ సభ్యులంతా ఒకే చోటుకు చేరి మరచిపోలేని మధుర జ్ఞాపకాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మైమరచిపోతారు.   

Similar News