సంప్రోక్షణ అనంతరం తెరుచుకున్న శబరిమల ఆలయం

సంప్రోక్షణ అనంతరం, శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తిరిగి తెరుచుకుంది. మహిళల ప్రవేశంతో ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ చేపట్టారు. ప్రధాన అర్చకుడి ఆదేశాలతో ఉదయం దాదాపు గంట పాటు ఆలయ ద్వారాలను మూసి, శుద్ధి చేశారు.

Update: 2019-01-02 08:05 GMT
Sabarimala temple

సంప్రోక్షణ అనంతరం, శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తిరిగి తెరుచుకుంది. మహిళల ప్రవేశంతో ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ చేపట్టారు. ప్రధాన అర్చకుడి ఆదేశాలతో ఉదయం దాదాపు గంట పాటు ఆలయ ద్వారాలను మూసి, శుద్ధి చేశారు. అనంతరం మళ్లీ ఆలయాన్ని తెరిచి భక్తుల దర్శనానికి వీలు కల్పించారు. మహిళలు ఆలయాన్ని దర్శించుకున్న విషయం తెలియగానే శబరిమల ఆలయ నిర్వాహకులు అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఆలయాన్ని శుద్ధి చేయాలని ప్రధాన అర్చకుడు ఆదేశించారు. దీంతో ద్వారాలను మూసివేసి సంప్రోక్షణ చేపట్టారు.

శబరిమల ఆలయంలోకి 50ఏళ్లలోపు ఇద్దరు మహిళలు ప్రవేశించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఏళ్ల తరబడి ఉన్న సంప్రదాయాలకు విరుద్ధంగా మహిళలు అయ్యప్పస్వామిని దర్శించుకోవడంపై దేశవ్యాప్తంగా అయ్యప్పభక్తులు ఆందోళనకు దిగారు. తిరువనంతపురంలోని కేరళ సెక్రటేరియట్ ఎదుట, అయ్యప్ప భక్తులు ఆందోళన నిర్వహించారు. మహిళలు ఆలయ సందర్శనపై పండలం రాజకుటుంబీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ సంప్రదాయాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

కోజికొడె జిల్లాకు చెందిన న్యాయవాది బిందు, సామాజిక కార్యకర్త కనకదుర్గ బుధవారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. వీరిద్దరూ హడావుడిగా ఆలయంలోకి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. అనంతరం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాగా వీరి ప్రవేశంపై భాజపా కార్యకర్తలు, అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేయనున్నట్లు ప్రకటించారు.

Similar News