బెంగాల్‌ రిజల్ట్స్‌పై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ

Update: 2019-05-22 07:43 GMT

మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్న వేళ బెంగాల్‌ రిజల్ట్స్‌పై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మమతా బెనర్జీని మట్టి కరిపించడమే లక్ష్యంగా కమల దళం సాగించిన హోరాహోరి ప్రచారం ఏమేరకు కలిసి వస్తుందనే దానిపై ఆసక్తి రేగుతోంది. కాషాయదళానికి డబుల్ డిజిట్‌‌ సీట్లు వస్తాయంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో మమతకు వచ్చే సీట్లెన్ని అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

నిత్య ఘర్షణలతో బీజేపీ వర్సెస్ మమతగా సాగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందనే ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. బెంగాల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. ఏడు విడతల్లో పోలింగ్ జరగ్గా ప్రతి విడతలో ప్రతి నియోజకవర్గంలో ఇరువురు నేతలు పర్యటించారు. మమతా బెనర్జీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారం సాగించారు .

బెంగాల్ అభివృద్ధికి దీదీ స్పీడ్ బ్రేకర్‌గా మారారంటూ విమర్శలు ప్రారంభించిన బీజేపీ చివరకు మమతా అవినీతి పాలనకు ముగింపు పలకాలంటూ పిలుపునిచ్చింది. ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ, మమతల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. ప్రధాని ప్రతి మాటకు కౌంటర్ ఇస్తూ మమత ఎన్నికల ప్రచారం సాగించారు. ఇక అమిత్‌షా పర్యటనకు అనుమతి నిరాకరించడం ద్వారా రగిలిన చిచ్చు కోల్‌కతాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే దాక వచ్చింది. దీంతో ఈ సారి ఎన్నికలు బీజేపీ వర్సెస్ మమతగా జరిగాయి. ఒకానొక దశలో మమతను ఉమ్మడి శత్రువుగా భావించిన కాంగ్రెస్‌, వామపక్షాలు పరోక్షంగా బీజేపీకే మద్దతు కూడా ప్రకటించాయి.

ఈ నేపధ్యంలోనే తాజాగా వెలువడిన ఎగ్జిట్ ఫలితాల్లో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు దక్కుతాయంటూ మెజార్టీ సర్వేలు వెల్లడించాయి. గడచిన ఎన్నికల్లో రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ ఈ సారి 11 సీట్ల వరకు సాధిస్తుందని ఇదే సమయంలో దీదీ పార్టీకి 20 సీట్లు మాత్రమే దక్కుతాయనే భావిస్తున్నారు. రాష్ట్రంలో తాము అంచనాలకు మించి సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే తమ ఓట్లకు సీట్లకు ఎలాంటి ఢోకా లేదని టీఎంసీ నేతలు చెబుతున్నారు. ఇరు పార్టీల ధీమాతో బెంగాల్ ఓటర్లు ఎవరికి షాక్ ఇవ్వనున్నారనేది ఆసక్తిగా మారింది. మరికొన్ని గంటలు గడిస్తే ఈ ప్రశ్నకు సమాధానం లభించనుంది. 

Similar News