కాకినాడ ఎంపీ బరిలో నాగబాబు?

Update: 2019-03-09 04:03 GMT

ఒకవైపు వలసల్లేక అంతర్మథనం, మరోవైపు వామపక్షాలతో పొత్తుల తలనొప్పులు పవన్‌ను చిరాకు చేస్తుంటే, మరోవైపు కాకినాడలో మాత్రం, జనసేనుడు పావులు వేగంగా కదుపుతున్నారు. తూర్పు ఓటరను ఆకర్షించేందుకు, ఒక అస్త్రాన్ని వదిలేందుకు సిద్దమవుతున్నారు. ఆ అస్త్రమేంటో తెలుసా అన్నయ్య నాగబాబు.

ఉభయగోదావరి జిల్లాలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకుంటుందనే సెంటిమెంట్ తొలి నుంచి ఉంది. అందుకు తగ్గట్టుగానే గత ఎన్నికల్లో ఈ జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీలే గద్దనెక్కాయి. 2009 ఎన్నికల్లో అతి తక్కువ కాలంలో ఎన్నికల బరిలో దిగిన ప్రజారాజ్యం, రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపించకపోయినా తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం నాలుగు అసెంబ్లీ స్ధానాల్లో విజయం సాధించింది. వాటిల్లో మూడు స్ధానాలు కాకినాడ పార్లమెంట్ పరధిలోనివే. జిల్లాలో కొత్తపేట, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్ స్ధానాలను అప్పట్లో పీఆర్పీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఇదే ఈక్వేషన్‌తో పార్లమెంట్ అభ్యర్ధిగా మెగా బ్రదర్ నాగబాబును బరిలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు పవన్.

కాకినాడ పార్లమెంట్ పరధిలోని 7 నియోజకవర్గాల్లో కాపుల బలంతో పాటు జనసేన బలం ఏ విధంగా ఉందో ఇప్పటికే ఓ సర్వే చేయించారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఊపందుకుంది. గతంలో గెలిచిన సీట్లతో పాటు ప్రస్తుతం జనసేనకు వస్తోన్న ఆదరణ చూసి ఈ నిర్ణయం తీసుకున్నారట. దీని వెనుక మరో ప్లాన్ కూడా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నాగబాబు గనుక పోటీలో దిగితే మెగా ఫ్యామిలీ అంతా ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఎలాగూ వస్తారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రాంచరణ్ సహా మెగా ఫ్యామిలీ అంతా కాకినాడలో ప్రచారం నిర్వహిస్తే అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు వీలు ఉంటుందనే ఈ ప్లాన్ వేశారట. పనిలో పనిగా అసెంబ్లీ అభ్యర్ధులకు సైతం ఇది ఉపకరిస్తుందనే ఆలోచనలతో వ్యూహం రచించారని జిల్లాలో చర్చ జరుగుతోంది. జనసేన ఆశావహులు సైతం ఈ నిర్ణయం తమకు కలసి వస్తుందనే ఆలోచనలతో ఓకే చెప్పారట. ఇప్పటికే నాగబాబు తమ్ముడు పవన్‌కు మద్దతుగా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వరుసగా హాట్‌ కామెంట్స్ పెడుతూ, వార్తల్లోనే ఉంటున్నారు. చూడాలి, తూర్పు సెంటిమెంట్‌ను ఆధారం చేసుకుని జనసేన వేస్తోన్న ప్రణాళికలు ఏ మేరకు కలసి వస్తాయో.

Similar News