చల్లని కబురు...జూన్‌ 1న....

Update: 2019-05-14 13:31 GMT

హైటెంపరేచర్స్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ ప్రజలకు వాతావరణ నిపుణులు చల్లని కబురు చెప్పారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ, సకాలంలోనే నైరుతి రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేశారు. ఎప్పటిలాగే షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.

ఉక్కపోతతో అల్లాడిపోతున్నప్రజలకు వాతావరణ నిపుణులు శుభవార్త చెప్పారు. సకాలంలోనే రుతుపవనాలు కేరళను తాకనున్నాయని నిపుణులు అంచనా వేశారు. జూన్ పది నాటికి రుతుపవనాలు దేశమంతా విస్తరిస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఆన్ టైమ్‌లోనే రావడానికి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, సముద్ర వాతావరణాన్ని అధ్యయనం చేస్తున్న నిపుణులు చెబుతున్నారు. భారత వాతావరణ కేంద్రం ఐఎండీ కూడా సకాలంలోనే మాన్‌సూన్ ఉంటుందని చల్లని కబురు చెప్పింది.

జూన్ ఒకటిన నైరుతి రుతు పవనాలు కేరళను తాకితే, జూన్ నాలుగైదు తేదీలకల్లా రాయలసీమ, తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే జూన్ 8 లేదా 9నాటికి ఆంధ్ర ప్రదేశ్‌లోకి కూడా విస్తరిస్తాయని తెలిపారు. ఇక జూన్ ‎పది పన్నెండుకల్లా దేశమంతా నైరుతి రుతు పవనాలు ప్రభావం చూపుతాయని అంటున్నారు.

వాస్తవానికి గత నాలుగేళ్లుగా సకాలంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచాన వేస్తున్నప్పటికీ చివరి నిమిషంలో ఏర్పడుతున్న డ్రైస్పెల్స్ కారణంగా వర్షాల రాక ఆలస్యమవుతోంది. అయితే ఈసారి భానుడి భగభగలు భారీగా ఉన్నందున డ్రైస్పెల్స్ ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు విశ్లేషిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సముద్రాల్లో కలుగుతున్న మార్పుల కారణంగానే నైరుతి రుతుపవనాల్లో చురుకుదనం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు.

సగటు వర్షపాతంలో 96 శాతం నుంచి 104 శాతం మధ్య ఉంటే సాధారణ వర్షపాతంగా, 90 శాతం కన్నా తక్కువ ఉంటే లోటు వర్షపాతంగా, 90-96 మధ్య ఉంటే సాధారణం కన్నా తక్కువ వర్షపాతంగా, 110 శాతం కన్నా ఎక్కువ ఉంటే అధిక వర్షపాతంగా గుర్తిస్తారు. వాతావరణ శాఖ, సముద్ర అధ్యయన నిపుణుల అంచనాల ప్రకారం అనుకున్న సమయానికి వర్షాలు వస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. ఇదే సమయంలో ఖరీఫ్ సీజన్ కూడా త్వరగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  

Similar News